యువకుని మృతి, ఇద్దరికీ గాయాలు
మృతుని సంబంధికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
విచారణ చేపట్టిన పోలీసులు
భీమ్ గల్, బతుకమ్మ
విద్యుత్ స్థంబాల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు డివైడర్ ను డీకొట్టి బోల్తాపడ్డ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగ, ఇద్దరికీ గాయలైన ఘటన ఆదివారం భీమ్ గల్ మండల కేంద్రంలో చోటు చేసుకొంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల మేరకు సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. భీమ్ గల్ సబ్ స్టేషన్ నుండి విద్యుత్ స్థంబాలను ఏ. పి. 01.హెచ్. 9221 ట్రాక్టర్ పై మండలంలోని చెంగల్ కు తీసుకొని వెళ్తుండగా డ్రైవర్ శుభంకర్ కర్మకర్ ట్రాక్టర్ ను వేగంగా, అజాగ్రత్తగా నడపగా పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్ వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి డివైడర్ ను డీకొట్టి ట్రాక్టర్ బోల్తాపడింది. ఆ ట్రాక్టర్ లో ఉన్న వెస్ట్ బెంగాల్ కు చెందిన లేబర్ దీపక్ గిరి (23) కింద పడగా ఆయన పైన విద్యుత్ స్థంబాలు పడ్డాయి. దాంతో దీపక్ గిరి తలకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునితో పాటు ట్రాక్టర్ పై ఉన్న తరుణ్ హాజ్ర కు కుడికాలు, ఫిర్యాదుదారు సహదూద్దీన్ మొల్లకు ఛాతిపై దెబ్బ తగిలి తీవ్రగాయాలు అయ్యాయి.మృతుడు దీపక్ గిరి తో పాటు క్షతగాత్రులు ఇద్దరు, మరో ఇద్దరు కలిసి మొత్తం ఐదుగురు లేబర్లు విద్యుత్ స్థంబాలను లోడ్ చేసే నిమిత్తం కాంట్రాక్టు పనిపై భీమ్ గల్ సబ్ స్టేషన్ కు వచ్చారు.పల్లారోడ్,బర్ధమాన్ జిల్లా వెస్ట్ బెంగాల్ కు చెందిన వీరైదుగురు మే నెల 18న భీమ్ గల్ వచ్చారు. క్షతగాత్రుడు సహదూద్దీన్ మొల్ల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

