నాగిరెడ్డిపేట, బతుకమ్మ :
ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ కోరారు. అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో హిందూ, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రభుత్వం గోవధ ను నిషేధించిందని, బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను వధిస్తే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ముస్లిం హిందూ మతాల కులపెద్దలు పోలీసులకు సహకరించాలన్నారు, సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా వచ్చే వార్తలను, పుకార్లను నమ్మవద్దని, వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయవద్దని సూచించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎవరైనా అక్రమంగా ఆవులను తరలిస్తే వాటి వివరాలను పోలీసులకు తెలియజేయాలి కానీ, ఆవులను తరలిస్తున్న వారిని అడ్డుకొని హింసిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతికి భంగం కలిగించే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల పెద్దలు, ఎస్సై మల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
