. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలర్ట్ అయిన యంత్రాంగం
. నగరంలో వరద ముప్పు లేకుండా జాగ్రత్తల దిశగా చర్యలు
. డ్రైనేజీల్లో పూడిక తొలగింపు.. నూతన మురుగు కాలువ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
. నగరంలో పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు, నుడా చైర్మన్ వేణు
. మురుగు కాలువలపై ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ముందస్తు వర్షాలు పాలకులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు, డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నుడా చైర్మన్ కేశ వేణు, రైతు కమిషన్ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గడుగు గంగాధర్ తోపాటు ఉన్నతాధికారులు మంగళవారం నగరంలో పర్యటించారు.
బైపాస్ రోడ్డులోని ఉర్దూ మీడియం స్కూల్ సమీపంలో ఉన్న డ్రైనేజీతోపాటునిజామ్ కాలనీలోని డ్రైనేజీని, బోధన్ రోడ్డు లోని రిలయన్స్ పెట్రోల్ బ్యాంకు సమీపంలో ఉన్న మురుగు కాల్వను, రాజరాజేంద్ర చౌరస్తా నుంచి పీఎఫ్ కార్యాలయం వరకు ఉన్న డ్రైనేజీని, సాయినగర్ రోడ్-నెంబర్ 1లో ఉన్న మురుగు కాల్వను, తీన్ కమాన్ నుంచి ఐడీఓసీ వరకు ఉన్న డ్రైనేజి, వినాయకనగర్ లోని బస్వా గార్డెన్ సమీపంలో గల మురుగు కాల్వను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కొత్తగా నిర్మించాల్సిన మురుగు కాల్వల ప్రతిపాదిత స్థలాలను సందర్శించి మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

ఆక్రమణాలపై సీరియస్..
నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీల ఆక్రమణలను గమనించిన కలెక్టర్..వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మురుగుకాలువల్లో పేరుకుపోయిన పూడికతోపాటు చెత్తాచెదారాన్ని తొలగించాలని, ఎక్కడ కూడా వర్షపు నీరు నిలువకుండా డ్రైనేజీలను శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురవకముందే డీ-సిల్టింగ్ పనులను పూర్తి చేయించాలని సూచించారు.
అవకాశం ఉన్నచోట జేసీబీ వంటి యంత్రాలను వినియోగించాలని, వీలుకాని చోట పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించాలన్నారు. నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీల పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇదివరకు వర్షాలు కురిసిన సమయంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. డ్రైనేజీల్లోకి చేరే వర్షపు జలాలు పూడిక కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోవడం కారణంగానే పలు ప్రాంతాలు జలమయమవుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పూడికతీత పనులను పక్కాగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
వారివెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఈఈ ఆనంద్ సాగర్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

