29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మంత్రులంతా అవినీతి అనకొండలు

Must read

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ ప్రభుత్వ మంటేనే కమీషన్ల పాలన

పీసీసీ అంటేనే ప్రదేశ్  కరెప్షన్ సెంటర్

బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి

 హైదరాబాద్, బతుకమ్మ : ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతి అనకొండ లేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. పనులను బట్టి మంత్రులకు లంచాలు ఇవ్వనిదే ఫైళ్లు కదలవని ఆయన ఆరోపించారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి మంత్రి పేషీలో ఇదే తంతు కొనసాగుతూ సచివాలయమంతా అవినీతి కంపు కొడుతోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంటేనే కమీషన్ల పాలన అని, ఇది తామన్నది కాదని, ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులకు డబ్బులు ఇవ్వాల్సిందేనని మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని గుర్తు చేశారని అన్నారు. ఈమాటలు కాంగ్రెస్ సర్కార్ అంతులేని అవినీతికి నిలువెత్తు నిదర్శనమని ఆయన అన్నారు. మంత్రి సురేఖ కామెంట్స్ పై రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డే పెద్ద అవినీతి భూతమని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి శరాఘాతమని ఆయన నిప్పులు చెరిగారు. పీసీసీ అంటేనే ప్రదేశ్  కరెప్షన్ సెంటర్ అని, అది  ఇండియన్ నేషనల్  క్రైమ్ అండ్ కరప్షన్ పార్టీ అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అవినీతి పునాదుల మీద పెరిగిన కాంగ్రెస్ పార్టీ పంచభూతాలనే భోంచేసిన పాపాల పుట్ట అని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటేనే ల్యాండ్,శాండ్, మైన్, వైన్ మాఫియా అని ఆయన దుయ్య బట్టారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ దేశాన్ని పాడు చేస్తున్న మిడతలదండుగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ అంటేనే సంపన్నులకు ఆపన్న హస్తం, పేదలకు రిక్త హస్తమని, అబద్దాలు, అవినీతి,అక్రమాలకు పుట్టిన అభవిక్త కవల అని మండిపడ్డారు. అందినకాడికి ప్రజాధనాన్ని నొక్కడంలో, మెక్కడంలో అందె వేసిన చెయ్యి అని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతి బాగోతాలపై సభా కమిటీ వేయాలని, లేదా సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతి మంత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

More articles

Latest article