24.7 C
Hyderabad
Monday, August 3, 2026

అప్పుల పేరు చెప్పి తప్పించుకుంటామంటే ఊరుకోబోం

Must read

📰 Generate e-Paper Clip

. బీఆర్ఎస్ అప్పులు చేసింది అంటున్నారు..

. నాటి ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్ పై మాట్లాడరెందకు..

. 15నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షా 60వేల కోట్ల అప్పులు చేసింది

. ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధి ప్రశ్నించడం తప్పా?

. కమ్మర్ పల్లి మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవేందర్

కమ్మర్ పల్లి, బతుకమ్మ: అప్పుల పేరు చెప్పి తప్పించుకుంటామంటే ఊరుకోబోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలో శుక్రవారం నాయకులతో కలిసి బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు దేవేందర్ విలేకరులతో మాట్లాడారు.

బీఆర్ఎస్ పదేళ్లలో రూ.4లక్షల 18వేల కోట్ల అప్పులు చేసినప్పటికీ రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్, భగీరథ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాట్లాడే నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు, బ్రిడ్జీలు, పీఆర్, ఆర్ అండ్ బీ రోడ్లు, కలెక్టరేట్ భవనాలు వంటి  కూడబెట్టిన ఆస్తులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 15 నెలల కాలంలోనే రూ.లక్షా 60వేల కోట్ల అప్పులు చేసిందని, సంక్షేమ పథకాలను అమలు చేసింది లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనులపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మంత్రిగా, మూడు పర్యాయలు ఎమ్మెల్యేగా పనిచేసిన వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని అడిగారని, ప్రతిపక్ష ఎమ్మెల్యే లకు సీడీపీ నిధులు ఇవ్వలేదని ఆయన ప్రశ్నిచడం తప్పా అని అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలను తరలించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరడం తప్పా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే గ్రామాల్లో తిరగనీయమని బెదిరిస్తే తాము భయపడి పారిపోమని, ప్రజలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటందని స్పష్టంచేశారు.

సమావేశంలో కమ్మర్ పల్లి తాజా మాజీ సర్పంచ్ స్వామి, చౌట్ పల్లి సొసైటీ చైర్మన్ కుంట ప్రతాప్ రెడ్డి, రైతు విభాగం మండల ప్రెసిడెంట్ బద్దం రాజ శేఖర్, టౌన్ ప్రెసిడెంట్ నరేందర్, సంత రాజేశ్వర్, మల్కాయి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article