- జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : ఉద్యోగుల, పెన్షనర్ల, జర్నలిస్టుల హెల్త్ స్కీం పరిధిలో పనిచేస్తున్న నిజామాబాద్ లోని వెల్నెస్ సెంటర్ కు కావలసిన అదనపు వసతి కల్పిస్తానని శనివారం నిజాంబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హామీ ఇచ్చారు. ఆ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పలు దఫాలుగా జిల్లా కలెక్టర్కు చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన శనివారం పాత మున్సిపల్ కార్యాలయం వెనుక నడుస్తున్న వెల్నెస్ సెంటర్ ని ఆయన ఇతర అధికారులతో కలిసి ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్రావు వెల్నెస్ సెంటర్కు అదనపు గదులు కేటాయించాలని, పేషెంట్లు కూర్చునేందుకు సరైన సదుపాయాలు లేవని, వసతి తక్కువగా ఉన్న కారణంగా డెంటల్, ఫిజియోథెరపీ, ఈసీజీ తదితర విభాగాల సామాగ్రి మూలకు పడేశారని, అందువల్ల ఈ వైద్య సౌకర్యాలు వినియోగించుకోలేకపోతున్నామని ఆయన తెలిపారు. ఎండకు సరైన ప్రొటెక్షన్ రక్షణ లేని కారణంగా మందులు పని చేయటం లేదని ఆయన తెలిపారు. అక్కడున్న సీనియర్ సిటిజెన్లతో కూడా కలెక్టర్ మాట్లాడారు. వెల్ నెస్ సెంటర్ ముందు బాగాన పెద్ద షెడ్డు వేయటానికి అంగీకరించారు. అదేవిధంగా ప్రక్కనున్న బిల్డింగుకు మరమ్మత్తులు చేసి వినియోగించాలని, దానికి సంబంధించిన అంచనాలు తయారు చేయమని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వెల్నెస్ సెంటర్ ను పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూడ చైర్మన్ కేశ వేణు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ఇంజనీరింగ్ సిబ్బంది, పెన్షనర్స్ నాయకులు కే రామ్మోహన్ రావు, హమీదుద్దీన్ డి లక్ష్మీనారాయణ రవీందర్ బోజా గౌడ్ గంగా కిషన్ ఉన్నారు.
