24 C
Hyderabad
Sunday, August 2, 2026

అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
  • కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 

 

నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 4వ తేదీన(ఆదివారం) జరగనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జ‌రగ‌నున్ననీట్ ప‌రీక్ష‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో 3398 మంది పరీక్షకు హాజరు కానున్నారని, ఈ మేరకు నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో నాలుగు, డిచ్పల్లి, బోధన్ లలో రెండు చొప్పున మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లా కేంద్రంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గోల్ హనుమాన్ సమీపంలోని కస్బాగల్లీలో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, నాగారంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల/కళాశాలలో నీట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే, బోధన్ పట్టణంలో రైల్వే గేట్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిల్డింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల బిల్డింగ్ లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని అన్నారు. కాగా, అభ్యర్థులు పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి కనీసం అరగంట ముందే లోనికి చేరుకోవాల్సి ఉన్నందున, నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని అన్నారు. నిర్ణీత సమయం దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్ష హాల్ లోనికి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియలు చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు ముందస్తుగానే చేరుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు పైన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరొక పోస్ట్ కార్డు సైజు ఫోటోను అతికించాలని అన్నారు. అదనంగా మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, అప్డేటెడ్ ఆధార్ కార్డును, లేటెస్ట్ ఫోటోతో కూడిన ఐ.డి ప్రూఫ్ ను అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థులు వైకల్యాన్ని ధ్రువీకరించే సర్టిఫికెట్లను తీసుకురావాలన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు పెన్నులు, పెన్సిళ్లను, ఇతర ఎలాంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావద్దని సూచించారు. పరీక్షా కేంద్రంలోని అభ్యర్థులకు అక్కడే పెన్నులను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఉపకారణాలైన మొబైల్ ఫోన్లు, డిజిటల్ చేతి గడియారాలు, బ్లూటూత్ వంటివి అనుమతించబడవని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, పకడ్బందీ నిఘా నడుమ సజావుగా పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నామని, పోలీసు బందోబస్తు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. నీట్ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం ఐ.డీ.ఓ.సీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 9912192692, 9885975254 నెంబర్లకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.

More articles

Latest article