27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అసైన్డ్ భూమి వెంచర్ కు ఫైనల్ లే అవుట్ పర్మిషనా..?

Must read

📰 Generate e-Paper Clip

  • ముప్కాల్ లో మాజీ ప్రజాప్రతినిధి హవా
  • మొదటి నుంచి వివాదాలున్నా పట్టించుకోని అధికారులు
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్థానిక నాయకులు

 

బాల్కొండ, బతుకమ్మ: ముప్కాల్ మండల కేంద్రంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి ఏర్పాటు చేసిన వెంచర్ మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగా మారింది. వెంచర్ అనుమతుల కోసం రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్న సదరు మాజీ ప్రజాప్రతినిధి చివరకు తాను అనుకున్నది సాధించాడు. మొత్తం 2.5 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న సదరు వ్యక్తి డీటీసీపీ అనుమతి కోసం ఎత్తుగడ వేశాడు. రెండు ఎకరాల భూమిని ఒక బిట్టుగా, మరో అర ఎకరం భూమిని మరో బిట్టుగా చూపుతూ డీటీసీపీ అనుమతుల కోసం జిల్లా స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వెనకాముందు చూడని అధికారులు వెంచర్ కు పర్మిషన్ ఇచ్చేయడం చర్చనీయాంశమైంది. 2.5 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేయాలంటే హైదరాబాద్ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. దీంతో మాజీ ప్రజాప్రతినిధి ఆ భూమిని రెండుగా చేసి అనుమతులు సాధించేశాడు. దీనిపై డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ విభాగానికి స్థానిక నాయకులు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టాలని అక్కడి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే కలెక్టర్ సైతం ఫిర్యాదు చేశాడు.

  • గతంలో జీపీ కార్యదర్శిపై వేటు..

మాజీ ప్రజాప్రతినిధి ఏర్పాటు చేయాలనుకున్న వెంచర్ కు స్థానిక అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ భూమికి సంబంధించిన గ్రామపంచాయతీలో రికార్డులు లేకపోవడం గమనార్హం.  నిబంధనల ప్రకారం జీపీకి పదిశాతం భూమి మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అయితే రికార్డులు లేకపోవడంతో అధి సాధ్యం కాలేదు. అయినప్పటి గతంలో పని చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంచర్ ఏర్పాటుకు సిఫారసు చేశారు. ఈ వ్యవహారంలో ఆయనపై వేటు పడింది. సరిగ్గా ఏడాది తర్వాత అదే స్థలంలో వెంచర్ కోసం ఫైనల్ లే అవుట్ పర్మిషన్ కు నిజామాబాద్ జిల్లా డీటీసీపీ అధికారులు ఓకే చేశారు. ఈ వ్యవహరం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా పలుకుబడి ఉంటే చాలు అసైన్డ్ భూమా, నీటి పారుదల శాఖ భూమా, ప్రభుత్వ భూమా అని పట్టించుకోకుండా లేఅవుట్ పర్మిషన్లు ఇస్తారని చర్చ మొదలయింది.

  • లక్ష్మీకాలువ స్థలం కబ్జా..

తన సొంత భూమితోపాటు సర్వే నంబర్ 70/1, 70/3 లోని లక్ష్మికాలువ స్థలాన్ని మాజీ ప్రజాప్రతినిధి (నేషనల్ హైవే 44 బ్రిడ్జికి సమీపంలో) ఆక్రమించి ఫెన్సింగ్ వేశారు. ఫంక్షన్ హాలుకు దీనినే రోడ్డు చూపాడు. దీనిపై సంబంధిత అధికారులకు గతంలో ఫిర్యాదు వెళ్లగా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ స్థాయి అధికారి సంబంధిత నోటీసులు జారీ చేశారు. లక్ష్మి మెయిన్ కెనాల్ స్థలంలో వేసిన పెన్షింగ్ ను 12 రోజుల్లో తొలగించాలని గతేడాది జూన్ లో ఆదేశించారు. సుమారు పదకొండు నెలలవుతున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ కి ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ లో కొనసాగిన మాజీ ప్రతినిధి ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యాడు. ఇప్పుడు నియోజకవర్గ ఇన్ చార్జీ అనుచరుడిగా కొనసాగుతున్న సదరు వ్యక్తి ఫంక్షన్ హాలు నిర్మించి లక్ష్మీ ప్రధాన కాలువ స్థలాన్ని కబ్జా చేశాడు. ఈ విషయమై జేఈ పలుమార్లు ప్రశ్నించేందుకు వెళ్లగా బెదిరిస్తూ వెనక్కి పంపించినా ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైంది. ఫంక్షన్ హాలు నిర్మాణం చేపట్టిన మాజీ ప్రజాప్రతినిధి ఫైర్ సేఫ్టీ కి సంబంధించి ఎన్ వోసీ లేకున్నా, లక్ష్మీ కాలువ భూమిని రోడ్డుగా చూపినా అధికారులు పట్టించుకోలేదు. తాజాగా అక్కడ ఫైనల్ లే అవుట్ కు అనుమతులు రావడంతో స్థానిక బీజేపీ నాయకుడు సంతోష్ డీటీసీపీ డైరెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన దానిపై విచారణకు ఆదేశించారు. సంబంధిత లక్ష్మీకాలువ కబ్జా , వెంచర్ దానికి అనుమతుల విషయంలో జిల్లా కలెక్టర్ సైతం ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Final layout permission for the assigned land venture..?

More articles

Latest article