. నిజామాబాద్ గంజ్ కేంద్రంగా వడ్డీ వ్యాపారం
. జిల్లాలోని ఇతర మార్కెట్ కమిటీల్లోనూ ఇదే పరిస్థితి
. పంట దిగుబడులు కొనడం మరిచిన వ్యాపారులు
. జోరుగా వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు
. పట్టించుకోని ఉన్నతాధికారులు
నిజామాబాద్, బతుకమ్మ: పంట దిగుబడులను కొనుగోలు చేసేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అధికారికంగా ఏర్పాటైన అడ్తి దుకాణాలు అ(వ)డ్డీ దుకాణాలుగా మారాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో అడ్తి వ్యాపారులుగా చలామణి అయిన వారు ఇప్పుడు ఆ వ్యాపారాన్ని మరించారు. అడ్తి దుకాణాలు కేంద్రంగా వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు.
గంజ్ లోని వ్యాపారులు ఒకప్పుడు పంటలు సాగు చేసేందుకు రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాలకు వడ్డీకి డబ్బులు ఇచ్చేవారు. రైతుల చేతికి పంట వచ్చిన తరువాత దానిని కొనుగోలు చేసిన మిగతా డబ్బులను చెల్లించే వారు. దీన్నికాస్తా వ్యాపారంగా మార్చేశారు. రైతుల భూములను ఏకంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు. అసలు పంట దిగుబడులు కొనకుండానే, రైతులతో సంబంధం లేకుండానే గంజ్ లో ఉంటూ ఫైనాన్షియర్లుగా చలామణి అవుతున్నారు.
సాధారణ వడ్డీ రూ.2గా నిర్ణయించి వ్యాపారం చేసిన వ్యాపారులు.. ఇప్పుడు రూ.5 నుంచి రూ.6 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఓ ప్రముఖ వ్యాపారి మోపాల్ మండలంలోని ఒకే గ్రామంలో ఏకంగా రూ.2కోట్ల వరకు అప్పులు ఇవ్వడం కొసమెరుపు. ఇలా ఎంతో మంది వ్యాపారులు గ్రామాల్లో లక్షలాది రూపాయాలు అప్పులు ఇస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఒకరిద్దరిని జమానాత్ గా పెట్టుకొని ప్రామిసరీ నోట్లు రాయించుకుంటున్న వ్యాపారులు భూములు వారి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. తమ వద్ద పని చేసే మునీమ్(సూపర్ వైజర్)ల ద్వారా ప్రతి ఆరు నెలలు లేదా ఏడాదికోసారి వడ్డీలు వసూలు చేస్తారు.
ఒక వేళ రైతు కట్టలేని పరిస్థితి ఉంటే భూమి సొంతం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ తోపాటు ఆర్మూర్, బోధన్ మార్కెట్ కమిటీల కేంద్రంగా జోరుగా సాగుతోంది. అసలు పంట దిగుబడులు కొంటున్నది ఎవరు..? అడ్తి వ్యాపారం పేరుతో అ(వ)డ్డీ వ్యాపారం చేస్తున్నదెరు? అనే దానిని ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు మార్కెట్ కమిటీలు కేంద్రంగా తమ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు.

అధికార యంత్రంగం.. ఇటు పోలీసులు..
వ్యవసాయ మార్కెట్ కమిటీలు కేంద్రంగా వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతున్నా అధికార యంత్రాంగం, పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవు. నిజామాబాద్ గంజ్ లోనే పదుల సంఖ్యలో పెద్ద వడ్డీ వ్యాపారులు ఉన్నారనేది బహిరంగ రహస్యం. అడ్తి దుకాణాల్లో నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.
రియల్ వ్యాపారంలో హవా
పలువురు అడ్తి వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రముఖులుగా చలామణి అవుతున్నారు. కొందరు వెంచర్లు ఏర్పాటు చేస్తుండగా, మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పార్టనర్ షిప్ దందా చేస్తున్నారు. ఇంకొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఫైనాన్షియర్లుగా చలామణి అవుతున్నారు. నిజామాబాద్ నగర శివార్లలో అపార్ట్ మెంట్లు, ఇళ్లు నిర్మిస్తూ విక్రయిస్తున్నారు. నిజామాబాద్ గంజ్ కేంద్రంగానే ప్లాట్లు, ఇళ్ల అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నాయి.
పోలీసులను మచ్చిక చేసుకొని..
వడ్డీ వ్యాపారులుగా చలామణి అవుతున్న వారు కొంత మంది పోలీసులను మచ్చిక చేసుకొని వారిని అడ్డుపెట్టుకొని వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. భూములు, ప్లాట్లు, ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పులు తీసుకున్న వారు నిర్ణీత కాలం తరువాత చెల్లించేందుకు వస్తే వ్యాపారులు ఒప్పుకోవడం లేదు. రిజిస్ర్టేషన్ చేసుకున్న ఆస్తులను తిరిగి అప్పగించేందుకు అంగీకరించడం లేదు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ లకు చేరితే సివిల్ వివాదాన్ని పోలీసులు పట్టించుకోకుండా పంపించాల్సి ఉండగా, వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ అప్పులు తీసుకున్న వారి మీదే కబ్జా, దౌర్జన్యం తదితర కేసులు నమోదు చేస్తున్నారనే విమర్శలున్నాయి.
