అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా
నిజామాబాద్, బతుకమ్మ : ఇందూరు జిల్లా క్రీడాకారులు ఒలంపిక్స్ మెడల్స్ లక్ష్యంగా పెట్టుకొని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన క్రీడా వార్షికోత్సవం 2024-2025 బహుమతుల ప్రదానోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇందూర్ జిల్లా అంటేనే క్రీడాకారులకు పెట్టిన పేరని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉండటం జిల్లాకు గర్వకారణమన్నారు. యువత మాదకద్రవ్యల, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా పేరుతో గ్రామస్థాయి నుంచి క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందన్నారు. గిరిరాజా కళాశాల పూర్వవిద్యార్థిగా, అర్బన్ ఎమ్మెల్యేగా కళాశాల అభివృద్ధికి తగిన నిధులు ప్రభుత్వం నుంచి వచ్చేలా కృషి చేస్తానన్నారు. అభివృద్ధి విషయంలో అవసరమైతే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్, కాంగ్రెస్ నాయకులతో కలిసి పని చేస్తానన్నారు. అనంతరం వివిధ క్రీడా రంగాలలో విజేతలుగా నిలిచినా క్రీడాకారులకు ఎమ్మెల్యే బహుమతులు అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఎస్ రంగా రత్నం, పీడీ డా. బాలమణి,తదితరులు పాల్గొన్నారు.

