- గత్యంతరం లేక కార్మికులు లైసెన్స్ లను కల్లు కాంట్రాక్టర్లకు అప్పచెప్పుతున్నారు
- ఈత చెట్ల నుండి కల్లు తీయకుండానే కృత్రిమంగా కల్లును తయారు చేస్తున్నారు
- కల్తీ కల్లు ఘటనపై ఉమ్మడి జిల్లా పౌర హక్కుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో నివేదిక
నిజామాబాద్ , బతుకమ్మ : కల్లు గీతను వృత్తిగా చేసుకుని జీవిస్తున్న గీత కార్మికులపైన కల్లు కాంట్రాక్టర్లు ఎక్సైజ్ శాఖ అధికారుల మద్దతుతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు.. గత్యంతరం లేక గీత కార్మికులు తమ లైసెన్స్లను కల్లు కాంట్రాక్టర్లకు అప్పచెప్పుతున్నారు. కల్లు ఉత్పత్తికి అవసరమైన ఈత చెట్లు ఉన్నప్పటికీ వాటి నుండి కల్లు తీయకుండానే డైజోఫాం, క్లోరోఫామ్, అల్పజోలం, చాక్రిన్, కుంకుడు పొడి ఉపయోగించి కృత్రిమంగా కల్లును తయారు చేస్తున్నారు. దీని కారణంగా కల్లు సేవించిన నసురుల్లబాద్ మండల పరిధిలో అంకోల్, అంకోల్ తండా, దుర్కి గ్రామాలలోని కల్తీకల్లు త్రాగి అస్వస్థతకు గురయ్యారని నిజామాబాదు ఉమ్మడి జిల్లా పౌర హక్కుల సంఘం కమిటీ నీవేదికలో వెల్లడించింది.
నిజామాబాదు ఉమ్మడి జిల్లా పౌర హక్కుల సంఘం కమిటీ ఈ నిజనిర్ధారణ బృందంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, రాష్ట్ర నాయకులు వి. సంగం న్యాయవాదులు ఎడ్ల రాము, గైని శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా నసురుల్లబాద్ మండల పరిధిలో అంకోల్, అంకోల్ తండా, దుర్కి గ్రామాలలోని కల్తీకల్లు త్రాగి అస్వస్థతకు గురైన బాధితులను బుధవారం కలిసి వివరాలు సేకరించారు. వారిని పరామర్శించారు.. నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు వివరాలు సేకరించారు. బాన్సువాడ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తో ఫోన్లో మాట్లాడి.. కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరుచగా రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు. ఈ నెల 7న దుర్కి, అంకోల్, అంకోల్ తాండా, సంగెం గ్రామాల ప్రజలు కల్తీకల్లు త్రాగి అస్వస్థతకు గరికాగా వారిని ప్రభుత్వ దావఖానా, బాన్సువాడ ప్రభుత్వ దావఖానా నిజామాబాద్ ఇతర ప్రైవేట్ దావఖానాలలకు తరలించి చికిత్స అందించారని తెలిపారు. కల్తీ కల్లుని సేవించన వారికి డిస్టోనియా వ్యాధికి గురయ్యారని తెలిపారు. వ్యక్తి ప్రమేయం లేకుండానే నరాలు పట్టేసి మెడ వంకర్లు పోవడము, తల వంకర్లు తిరగడం కళ్ళు మేలేయడం నాలుక మొద్దు బారుడము, మాటలు తత్తర్లు పోవడం, మత్తుగా నిద్రపోవడం వంటి సంఘటనలు జరిగినట్లు పేర్కొన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు, ఆశ వర్కర్లు ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. మూడు నుండి ఐదు రోజులు వివిధ దావఖానాలలో ఉండి చికిత్స పొందారని తెలిపారు. కల్తీకల్లు త్రాగిన వారిలో మెజార్టీ ఉపాధిహామీ కూలీలున్నారని తెలిపారు. అంకోల్ గ్రామంలో 20 మంది, అంకోల్ తాండాలో 11 మంది, సంగెం, దామరంచ, దుర్కి గ్రామాలలో బాధితులు ఉన్నారన్నారు. అందులో యస్.సి, యఎస్.టి, బి.సి కులాల వారు ఉన్నారని తెలిపారు. వీరందరూ పేదవారు. కూలీ పని చేసుకుంటేనే కుటుంబం గడుస్తుందన్నారు. కల్తీ కల్లు త్రాగిన వారు మూడు నుండి ఐదు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందారని తెలిపారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వారు అనారోగ్యంగా ఉన్నారన్నారు. వారికి ఉచిత వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు.
కల్లు కాంట్రాక్టర్ సురేందర్ గౌడ్ దుర్కి గ్రామంలో కల్లును తయారుచేసి దుర్కి, అంకోల్, అంకోల్ తండా తదితర గ్రామాలకు సరఫరా చేస్తాడని తెలిపారు. ఈ గ్రామాల్లో గీత కార్మికులు టీఎఫ్టీ లైసెన్స్ కలిగి ఉన్నారని.. అంటే వీరు వ్యక్తిగతంగా చెట్ల నుండి కల్లు గీసుకోని నేరుగా అమ్ముకోవాలని తెలిపారు. కానీ వీరందరూ వారి లైసెన్సులను సురేందర్ గౌడ్ కు అమ్మివేశారని దుర్కి గ్రామస్తులైన భూమాగౌడ్, కిషన్ గౌడ్ లు కల్లు గీసి అమ్ముకొని జీవనం పొందుతున్నారని తెలిపారు. నిజమైన గీత కార్మికులు కల్లుగీయడం లేదన్నారు.. ఈ ప్రాంతంలో కల్లు ఉత్పత్తికి అవసరమైన ఈత చెట్లు ఉన్నప్పటికీ వాటి నుండి కల్లు తీయకుండానే డైజోఫాం, క్లోరోఫామ్, అల్పజోలం, చాక్రిన్, కుంకుడు పొడి ఉపయోగించి కృత్రిమంగా కల్లును తయారు చేస్తున్నారని తెలిపారు. దీని కారణంగా కల్లు సేవించిన వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. డైజోఫాం, క్లోరోఫామ్, అల్పజోలం ఉపయోగించి తయారు చేసిన కల్తీ కల్లు ను ప్రజలు తాగడం వలన అనారోగ్యానికి గురిగాడమే కాకుండా నరాల బలహీత కూడా గురవుతున్నారని అన్నారు.కల్తీ కల్లు లేనిదే నిద్రపోవడం లేదని, కల్లు సేవించకుండా పనికి పూనుకోవడం లేదని. కల్తీకల్లుకు పేద ప్రజలు పూర్తిగా బానిసలు అయ్యారని అన్నారు. దీనికి కృత్రిమంగా తయారు చేసిన కల్లే కారణమని తెలిపారు. కల్లు కల్తీ జరగకుండా నిరోధించాలిసిన ఎక్సైజ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపించిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కల్లు కల్తీ జరుగుతున్న పట్టించుకోలేదని.. ఎక్సైజ్ అధికారులు కల్లు శాంపిల్స్ తీసుకున్నప్పటికీ కల్తీ కల్లును నిరోధించలేకపోయారని పేర్కోన్నారు.
- కల్లు కల్తీ నిరోధానికి తక్షణమే నిజనిర్ధారణ కమిటి పలు సిఫారసులను చేసింది….
కల్తీకల్లు బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నష్టపరిహారం కాంట్రాక్టర్ నుండి ఇప్పించాలి. బాధితులందరికీ నెలరోజుల పాటు ఉచిత వైద్యాన్ని ప్రభుత్వం అందించాలి. కల్తీకల్లును నిరోధించడానికి కల్లును వ్యాపారం చేసే కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలి. కాంట్రాక్ట్ చేసేటటువంటి వారిపై కేసులు నమోదు చేయాలి. కల్తీకల్లు సేవించడం అలవాటు పడినటువంటి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించి కల్తీకల్లును మాన్పించే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలి. నిషేధిత మత్తు పాదార్థలైన డైజోఫాం, క్లోరోఫామ్, అల్పజోలం అక్రమ రవాణాలను అరికట్టాలి. నిజమైన గీత కార్మికులకు మాత్రమే గీతా లైసెన్స్ ను ఇవ్వాలి. ప్రభుత్వం గీత కార్మికులకు నెలకు రూ: 3 వేల పెన్షన్ ఇవ్వాలి. ప్రజలకు నాణ్యమైన కల్లును, నీరాను ప్రభుత్వమే గీత కార్మికుల నుండి సేకరించి అందించాలి. గీతా పారిశ్రామిక సహకార సొసైటీలను ప్రభుత్వమే నిర్వహించాలని సిపారసు చేశారు.

