. సన్నబియ్యం ఎలా ఉన్నాయని ఆరా
. మామిడిపల్లిలో లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం
ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన రేషన్ లబ్ధిదారుడు లక్కారం తవ్వన్నతోపాటు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఇన్ చార్జి మంత్రిజూపల్లి కృష్ణారావు సన్నబియ్యంతో భోజనం చేశారు. లబ్ధిదారు కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
సన్నబియ్యం ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, తవ్వన్న ఇంట్లో ఉమ్మడి కుటుంబాన్న చూడటం, వారితో కలిసి భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు. పేద, సామాన్య ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు.

గతంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా వాటిని చాలామంది లబ్ధిదారులు తినేందుకు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయించేవారని, సన్నబియ్యం మార్కెట్‌లో కొనుక్కుని తిరేవారన్నారు. ప్రభుత్వంపై భారం పడుతున్నా పేద, సామాన్య ప్రజలు కడుపునిండా తినేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ చార్జి ముత్యాల సునీల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్ వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

