27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సంకెళ్లు వేస్తున్నా మారనిస్థితి

Must read

📰 Generate e-Paper Clip

  • . పేరుకే రాత్రి 10.30కి దుకాణాల మూసివేత
  • . ముందు మూసి ఉంచి.. వెనుక నుంచి పార్సిళ్లు
  • . వ్యాపారుల కొత్త ఎత్తుగడ
  • . లిక్కర్, పాస్ మొదలుకుని ఫుడ్ పార్సిళ్ల వరకు అన్నీ అందుబాటులో

 

నిజామాబాద్, బతుకమ్మ: శాంతి భద్రతల పరిరక్షణ కోసం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పోలీస్ కమిషనర్ సాయిచైతన్య కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల పర్వదినాలు ముగిసిన వెంటనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆపరేషన్ టప్ప చబుత్రా నిర్వహించి పలువురికి షాక్ ఇచ్చారు. రైల్వేస్టేషన్ మొదలుకుని అన్నీ పోలీస్ స్టేషన్ల పరిధిలో వ్యాపార, వాణిజ్య సముదాయాలకు టైమ్ డెడ్ లైన్ విధించారు.  రాత్రి 10.30గంటల తర్వాత హోటళ్లు, మద్యం దుకాణాలు, ఐస్ క్రీం పార్లర్ప న్ షాప్ లు తెరిచి ఉంచితే కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై సిటి పోలీసు యాక్టు కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. పోలీసుశాఖ చర్యలు ఓ వైపు సత్ఫలతాలు ఇస్తున్నప్పటికీ… మరో వైపు వ్యాపారులు మాత్రం తమ దందా సాగిస్తున్నారు.

నిజామాబాద్ నగరం మినీ ఇండియా పేరు గాంచింది. ఇక్కడ ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల కల్చర్ ఉంది. అదే విధంగా రాత్రివేళ జన సంచారానికి అడ్డూఅదుపు లేదు. రాత్రివేళ నిజామాబాద్ నగరంలో గంజాయి తాగేవారితో పాటు రౌడీషీటర్లు, దొంగల సంచారం, అనుమానితుల కదలికలు పెరిగాయి. నెల రోజుల కాలంలో దాదాపు అరడజన్ కత్తిపోట్ల ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసు కమిషనర్ రాత్రివేళ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపారు. రాత్రి 10.30గంటల తర్వాత వ్యాపార వాణిజ్యల కట్టడిని కఠినంగా అమలు చేసేందుకు కల్పించారు. కానీ వ్యాపారులు కూడా అందుకు భిన్నంగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఏళ్ళ తరబడి స్థానిక ఎస్సైలు, సీఐల నుంచి ఏసీపీల వరకు అందరికీ టచ్ లో ఉండే వ్యాపారులకు పోలీసు కమిషనర్ దూకుడు వ్యవహారం మింగుడుపడడం లేదు.

  • పేరుకే మూసి ఉంచుతున్నారు..

నగరంలో రాత్రివేళ వ్యాపారాలు నిర్వహించే హోటళ్ళ నిర్వాహకులు బ్యాక్ డోర్ డెలివరికి తెరలేపారు. అన్ని ప్రముఖ హోటళ్లు ప్రధాన ద్వారాలను మూసివేసి వెనుక డోర్ ల నుంచి డెలివరీ చేస్తున్నారు. వాహనాలను ఓ వద్ద పార్కింగ్ చేయించి లోపల ఫుడ్ సర్విస్ తోపాటు పార్సిళ్లను కూడా సప్లయ్ చేస్తున్నారు. నగరంలోని బార్ లలో లూజ్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. అంగడిబజార్ లోని బార్ వద్ద రాత్రి ఒంటిగంట వరకు అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. పక్కనే ఉన్న కల్లుబట్టి వద్ద చీప్ లిక్కర్ అమ్మకాలు ఉదయం నాలుగు గంటల నుంచే ప్రారంభిస్తున్నారు. నగరంలోని ప్రగతినగర్ రోడ్డులో గల పాన్ షాప్ ల నుంచి పాన్ అమ్మకాలు బైక్ లలో వచ్చి డెలివరీ చేస్తున్నారు. ప్రముఖ హోటళ్ళలో బిర్యానీల అమ్మకాలు యథావిధిగా సాగుతున్నాయి. నగరంలోని బోధన్ రోడ్డులో గల డెయిరీ ఫారం(సారంగాపూర్) కమాన్ వద్ద ఉన్న హోటళ్ళు తెల్లవారు జాము వరకు కొనసాగిస్తున్నారు. నక్షత్రాల హోటళ్ళలో మద్యంతో పాటు మంచింగ్ అమ్మకాలు బ్యాక్ డోర్ డెలివరి జరుగుతోంది.

More articles

Latest article