- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైందని తెలిపారు. 12 ఏళ్లుగా ఓ పీడకలలా వెంటాడుతున్న బాధితుల కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించడం పట్ల బీజేపీ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు జీరో టోలెరెన్స్ విధానంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత11 ఏళ్ల బీజేపీ పాలనలో ఇలాంటి ఘటనలకు తావు లేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించే దిశగా మోదీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో బుజ్జగింపు రాజకీయాలు ఏ మాత్రం ప్రోత్సహించకూడదని. దీన్ని అన్ని రాజకీయపార్టీలు దీన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ చేసి, నిందితులను శిక్షించడంలో కీలకపాత్ర వహించిందన్నారు. ఈ పేలుళ్ళ సంఘటన దర్యాప్తు చేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. దేశ భద్రత కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరింత కఠిన చర్యలు ప్రభుత్వాలు ఆవలంభించాలని కోరారు.
