29 C
Hyderabad
Monday, August 3, 2026

సబ్ డివిజన్ తరలింపు?

Must read

📰 Generate e-Paper Clip

. టీఎస్ ఎన్ పీడీసీఎల్ కంపెనీ సీఎండీకి సిఫారసు

. టౌన్ 3ని ధర్పల్లికి తరలించేందుకు ప్రయత్నాలు

. అర్బన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లకుండానే పావులు కదుపతున్న వైనం

. నాలుగేళ్లుగా గాంధీ చౌక్ సెక్షన్ మూలకు  

నిజామాబాద్, బతుకమ్మ:  జిల్లా కేంద్రంలోని టౌన్ 3 సబ్ డివిజన్ ను డిచ్ పల్లి డివిజన్ లోని ధర్పల్లికి తరలించేందుకు అంతర్గతంగా తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి అధికారులే సూత్రధారులుగా మారి పావులు కదువుపుతున్నారని, కంపెనీ సీఎండీకి సైతం సిఫారసు చేశారని సమాచారం.

అప్పుడు అవసరమై..

నగరం దినదినాభివృద్ది చెందుతుండగా అదే స్థాయిలో విద్యుత్ కనెక్షన్ల సంఖ్య సైతం పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నగరమంతా ఉన్న ఒకే సబ్  డివిజన్ ను రెండుగా విభజించి టౌన్ 2గా ఏర్పాటు చేశారు. గృహావసరాలకు, వాణిజ్యపరంగా క్రమేణ కనెక్షన్లు పెరుగుతుండడంతో మరో సబ్ డివిజన్ ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కంపెనీకి విజ్ఞప్తి చేశారు. దీంతో అనతికాలంలోనే మరో సబ్ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం లభించడంతోపాటు నాగారం, సుభాష్ నగర్, గాంధీ చౌక్ సెక్షన్లను సైతం మంజూరు చేశారు. ఇందులో సుభాష్ నగర్, నాగారం సెక్షన్లు ఏర్పాటు కాగా, గాంధీ చౌక్ ను విస్మరించారు. ఇది ఏర్పాటైతే ప్రస్తుతం డీ6 పరిధిలో ఉన్న కనెక్షన్లు దీని పరిధిలోకి వస్తాయి. దీంతోపాటు వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే అవకాశాలుంటాయి. నగరంలో కనెక్షన్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే టౌన్ 3 ని ఏర్పాటు చేశారు. మూలకు పడేసిన గాంధీ చౌక్ సెక్షన్ మినహా నగరంలో తొమ్మిది సెక్షన్లలో టౌన్ 1కు డీ1, డీ6, టౌన్ 2కు డీ5, డీ2, డీ9, డీ3, టౌన్ 3కి డీ4, డీ7, డీ8 కేటాయించారు.

 

టౌన్ 3కి పని లేదని..

డిచ్పల్లి డివిజన్ తరలించకముందే టౌన్3ని తరలించాలని గత నెల చివరిలో  సీఎండీకి గుట్టు చప్పుడు కాకుండా ప్రతిపాదనలు పంపడం పవర్ హౌస్ కాంపౌండ్ లో చర్చనీయంశమైంది. టౌన్ 3 పరిధిలో డీ4, డీ7, డీ8 సెక్షన్ లు ఉండగా, సుమారు 40 వేలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి. సర్వీసులు పెరుగుతున్న దృష్ట్యా సబ్ డివిజన్ అవసరం ఉందని ఏర్పాటు చేయించడంలో కృషి చేసిన అధికారులే, ప్రస్తుతం టౌన్ 3 ఏడీఈకి పని లేదని పేర్కొనడం హాస్యాస్పదమవుతోంది.  సమ స్థాయిలో పని ఉండాలంటే  పునర్వ్యవస్థీకరణ చేపట్టాలనే ప్రతిపాదనలు  ఏఈలు, ఏడీఈల నుంచి వస్తున్నాయి. టౌన్ 2కు డీ5, డీ7, డీ9, టౌన్ 3కి డీ4, డీ2, డీ7, టౌన్ 1కు డీ1, డీ6, డీ8 సెక్షన్లను విభజిస్తే విధులు సౌకర్యవంతంగా ఉంటాయనే అభిప్రాయాలను సిబ్బంది వెలిబుచ్చుతున్నారు. ఇంతలో  గాంధీ చౌక్ సెక్షన్ ఏర్పడితే టౌన్ 1కు కేటాయిస్తే సరిపోతుందని ప్రతిపాదిస్తున్నారు.

 

అర్బన్ ఎమ్మెల్యేకు తెలియకుండానే

నగరంలో ఉన్న టౌన్ 3 తరలింపు విషయం అర్బన్ ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాణిజ్యపరంగా విద్యుత్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో సబ్ డివిజన్ మళ్లింపు హేయమైన చర్యగా ఉద్యోగులు భావిస్తున్నారు. టౌన్ 3ని  ధర్పల్లి  డైవర్షన్ కోసం  సీఎండీకి సిఫారసు చేయడం చూస్తే ప్రజాప్రతినిధుల మద్య పొరపొచ్చాలు తీసుకురావడమేననే చర్చ విద్యుత్ శాఖలో జరుగుతోంది.  పని చేస్తున్న  వాటిని తరలించే బదులు కొత్తవి మంజూరు చేయించి వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన అధికారులు సర్దుబాటుకు పూనుకోవడం చూస్తే శాఖను నవ్వులపాలు చేయడమేనని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

 

ధర్పల్లి కోసం డైవర్షన్

సిరికొండ, గడ్కోల్, ధర్పల్లిని కలిపి ఒక సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి విద్యుత్ శాఖాధికారులకు సూచించారు. అక్కడి ప్రాంత రైతులు విద్యుత్ పనుల నిమిత్తం నిజామాబాద్ కు రావాల్సి వస్తోందని అతి తొందరలో సబ్ డివిజన్ ఏర్పాటుతోపాటు ఎస్పీఎం ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యే కోరారు.   రూరల్ ఎమ్మెల్యే కోరిక మేరకు కొత్తది మంజూరు కావాలంటే సమయం పడుతుందని, ఉన్నదాంట్లో నుంచి ఒక సబ్ డివిజన్ ను పంపిస్తే పోతందని భావించిన అధికారులు ఆ దిశగానే పనులు చక్కబెడుతున్నారని సమాచారం. టౌన్ 3ని డైవర్షన్ చేస్తున్నారా అని ఒక యూనియన్ ప్రతినిధి వెళ్లి అధికారిని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని చెప్పినట్లు తెలిసింది.

More articles

Latest article