కామారెడ్డి, బతుకమ్మ : బాబూ జగ్జీవన్ రాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 40 సంవత్సరాలు పార్లమెంట్రియన్ గా, 10 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా జగ్జీవన్ రాం పనిచేశారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీలు రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారు యూనిట్ల స్థాపనకు ఈ నెల 14 లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్ర కాంత్ రెడ్డి మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రాం ఎంపీ గా, ఉప ప్రధానిగా పనిచేశారన్నారు. జిల్లాలో శాఖ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అంతకుముందు పలువురు పలు సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, ఆర్డీవో వీణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
