- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
- మాదకద్రవ్యాల నిర్మూలనకై వాలు పోస్టర్లు ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
కామారెడ్డి, బతుకమ్మ : మాదకద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని మిని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా స్థాయి నార్కో- కో ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల ప్రభావానికి జిల్లా ప్రజలు దూరంగా ఉండేలా పోలీస్, విద్యా, వైద్య ఆరోగ్య, ఎక్సైజ్, వ్యవసాయ, డాగ్స్ నియంత్రణ, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను వేయడం జరిగిందని అదేవిధంగా పాఠశాలలలో మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాలపై చిన్నారులకు క్విజ్, ఉపన్యాసం, వ్యాస రచన పోటీలను నిర్వహించాలని అన్నారు. మాదకద్రవ్యాల ప్రలోభాలకు గురైన వారికి కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక సదుపాయం ఉందని దానిని ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. వ్యవసాయ అధికారులు, అటవీశాఖ అధికారులు గంజాయి సాగు జరగకుండా చూడాలని అన్నారు. వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా ఎస్పి మాట్లాడుతూ.. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 05 గంజాయి కేసులను నమోదు చేయడం జరిగిందని కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్, బిచ్కుంద, భిక్నూర్, మరియు దేవనిపల్లి పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని, నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. తద్వారా కుటుంబ సభ్యుల సత్సంబంధాలుకు దూరమవుతారని అన్నారు. చెడు అలవాట్లకు బానిసై, యువత చెడిపోవద్దని ఆయన సూచించారు. జిల్లాలో కల్లు దుకాణాలపై ప్రత్యేక నిగా పెట్టి ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సంబంధిత డిపార్ట్మెంట్లు కలిసి కల్లు దుకాణాలు చెక్ చేసి వాటిని శాంపుల్ సేకరించి ల్యాబ్ పంపి, వచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆల్ఫాజోలం గుర్తించినట్లయితే కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపినారు. అదేవిధంగా పోలీస్ కళాబృందం ద్వారా మరియు ఇతర శాఖల సమన్వయంతో మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగి నష్టాలను ప్రజలకు తెలియజేసి వారిలో అవగాహన తీసుకురావాలని మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా దాని నుండి ఆదిలోనే తుంచి వేయాలని కోరారు. ఎవరైనా నిషేధిత మాదక ద్రవ్యాల యొక్క సమాచారాని తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే సెల్ నెం. 8712686133 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాలు విక్రయించిన, తీసుకున్న వారికి కఠిన శిక్షలు తప్పవు అని ఎస్పీ తెలిపారు. అనంతరం యాంటీ డ్రగ్స్ కి సంబంధించిన అవగాహన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
