- మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార యత్నం నుండి తప్పించుకోవడానికి ట్రైన్ లో నుండి దూకిన బాధితురాలిని బీఆర్ఎస్ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి గాంధీ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సదర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో బాధితురాలిపై అత్యాచార యత్నం జరిగిందని తెలిపారు. మహిళ కోచ్ లోకి నిందితుడు ప్రవేశించి అత్యాచార యత్నం చేశాడన్నారు. ఆగంతకుడి నుండి తప్పించుకునేందుకు బాధితురాలు ట్రైన్ నుండి కిందకు దూకిందని తెలిపారు. అమ్మాయికి గాయాల పాలై చికిత్స జరుగుతుందన్నారు. బస్సులో, ట్రైన్స్ లో కూడా మహిళలలకు భద్రత కరువైందని మండిపడ్డారు. మహిళలపై అత్యాచారం కేసులు, క్రైమ్ రేట్ 22 శాతం పెరిగినట్లు నివేదికలు చెప్తున్నాయని పేర్కొన్నారు. మహిళల భద్రతపై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలిను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో షీ టీమ్స్ ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాజకీయ వేదిక చేశారని, కమాండ్ కంట్రోల్ సెంటర్ పోలీసులకు వదిలేయాలని సూచించారు. లక్ష కెమెరాలు కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షణ చేయవచ్చని తెలిపారు. కానీ సెక్రటేరియట్ లో జరగాల్సిన కార్యకలాపాలు కమాండ్ కంట్రోల్ లో చేస్తున్నారని మండిపడ్డారు. కమాండ్ కంట్రోల్ ను పోలీసులకు కి అప్పగించి, శాంతి భద్రతలు కాపాడాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అందాల పోటీ లు కాదు.. మహిళలకు భద్రత కల్పించాలని అన్నారు. ఓ తల్లి తన కూతుళ్లు భద్రంగా ఉండాలి అని కోరుకుంటుంది, అందాల పోటీ కోరుకోవడం లేదని అన్నారు. బాధితురాలి పండ్లు మొత్తం ఉడిపోయాయని, ఇప్పటి వరకు డెంటల్ డాక్టర్ కూడా రాలేదని మండిపడ్డారు. బాధితురాలికు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందని, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నేరాలను నియంత్రించాలని అన్నారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

