శ్రీవారి ఆస్తులను కాపాడటమే లక్ష్యం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తాం
టీటీడీ సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
వెబ్ న్యూస్,బతుకమ్మ : తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం మనువడు నారా దేవాంశ్ జన్మదినం సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబు, కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. అనంతరం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఏడుకొండలు శ్రీవారి సొంతం, ఇక్కడ ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదన్నారు. ఏడు కొండలను అనుకొని ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదన్నారు. వేంకటేశ్వర స్వామి ఆస్తులను కాపాడటమే లక్ష్యమన్నారు. తిరుమలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వస్తున్నారని.. అన్నదానానికి వితరణ ఇస్తున్నారని సీఎం అన్నారు. నారా దేవాంశ్ జన్మదినం సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఒక రోజు ప్రసాదాల పంపిణీకి అయ్యే ఖర్చు రూ.44 లక్షలను విరాళంగా ఇచ్చామన్నారు. కుటుంబసభ్యులతో కలిసి భక్తులకు స్వయంగా ప్రసాదం వడ్డించడం చాలా తృప్తిని ఇచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలను కట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

