. ఆందోళనలతో అన్నదాత
. పలుచోట్ల పశువులకు మేతగా మారుతున్న వరి
నిజామాబాద్, బతుకమ్మ : నెర్రెలుపారుతున్న భూమి.. కళ్ల ముందే ఎండుతున్న పొలాలు.. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట పశువులకు మేతగా మారిన దృశ్యాలను చూస్తూ రైతు గుండె తల్లడిల్లుతోంది. ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వేసవికి ముందే కరువు చాయలు అలుముకుంటున్నాయి. బోర్లు ఎత్తిపోతున్నాయి. కొత్తవి తవ్వినా నీటి చుక్క జాడ లేక అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట ఎండి పోతుండడం, బోర్లు వేసేందుకు వెచ్చిస్తున్న లక్షల రూపాయలు అప్పుగా మిగులుతుండడంతో రైతు బతుకు దుర్భరమవుతోంది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిశాయి. చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి. కానీ వేసవి ప్రారంభానికి ముందే నీటి సమస్య తీవ్ర కావడం కలవరపెడుతోంది. సాగునీటి విషయంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళికా లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నీటికి కటకట
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో భారీగా పంటలు సాగు చేశారు. రెండు జిల్లాల్లో కలిపి సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు వేయగా, ప్రధానంగా వరి ఎక్కువగా సాగు చేశారు. రైతులు ఆశించినట్లుగానే పొలాలు ఏపుగా పెరిగాయి. కొన్నిచోట్ల వరి పొట్ట దశలో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పొట్ట దశకు వస్తోంది. నీరు అత్యధికంగా అవసరమైన ఈ సమయంలోనే నీటి సమస్య మొదలైంది. బావులు ఎండిపోగా, భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోతున్నాయి. నీళ్లు లేక పొలాలు బీళ్లు వారుతున్నాయి. ట్యాంకర్లతో నీళ్లందిస్తున్నా లాభం లేకపోవడంతో చివరకు పంటలను పశువులకు వదిలేస్తున్నారు.


