- జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జనబహుళ్యపు ఆకాంక్ష ల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ తన అధికారిక విధులను నిర్వహిస్తున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల తెలిపారు.జాతీయ లోక్ అదాలత్ మార్చి 8 న నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో విలేకరుల సమావేశంలో ఆమె సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి తో కలిసి మాట్లాడారు. ప్రజలందరికి న్యాయవిజ్ఞానాన్ని అందించడంలో సంస్థ తనవంతు కృషి చేస్తున్నదని అన్నారు.పొక్సో క్రిమినల్ కేసులలో బాధితులకు ఆర్థికంగా అండగా నిలిచామని పేర్కొన్నారు. హత్యకేసులలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు ఆర్థిక పరిహారాన్ని అందించి వారి భవిష్యత్తు భద్రతకు భద్రమైన పునాధిని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. జాతీయ న్యాయసేవ ప్రాధికార సంస్థ నాల్సా ప్రోత్సహం,ప్రేరణ నే స్పూర్తిగా నిలిచిందని అభివర్ణించారు. మహిళ సాధికారతకు సంస్థ చేదోడుగా నిలిచిందని అన్నారు. జిల్లాలో బాలికల స్వయం భద్రతకు బాటలు వేశామని,ఆత్మరక్షణకు అవసరమైన మేరకు శిక్షణ ఇప్పించడం న్యాయసేవ సంస్థ కీర్తికిరీటంలో కలికి తురాయిగా నిలిచిపోతుందని జిల్లాజడ్జి అభిలషించారు.రాజీపద్దతిన రాజీపడదగిన క్రిమినల్ కేసులు,అన్ని రకాల సివిల్ దావాలు వీలైనంత వరకు జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం అయ్యే విదంగా కృషి చేసినట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారం లీగల్ అవేర్ నెస్,మాడ్యూల్ క్యాంప్ లను జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు.శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
