29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇదేం సెక్షన్ మార్పులు

Must read

📰 Generate e-Paper Clip

  • ముదుర్లకు పెద్దపీట
  • వేతనాలు అడిగినందుకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బలి?
  • బల్ధియాలో సెక్షన్ల మార్పిడిపై చర్చ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇటీవల జరిగిన సెక్షన్ల మార్పిడిపై చర్చ జరుగుతుంది. పైకి మాత్రం స్థానిక అవసరాల కారణంగానే సెక్షన్లను మార్పిడి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ కారణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు పెంచకపోగా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఇతర సెక్షన్లకు స్థానచలనం చేయడంపై బల్ధియాలో చర్చ మొదలయింది. అంతేగాకుండా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏళ్ళ తరబడి సెక్షన్లను అతుక్కుని ప్రతి ఫైల్ కు డబ్బులు గుంజే వారిని వదిలి కొత్త వారిని, ఎలాంటి ఆరోపణలను లేని వారిని కదపడంపై ఆరోపణలు వస్తున్నాయి. బల్ధియాలో కొందరు ఉద్యోగులు పదవి విరమణ చేసినా ఇంజనీర్ సెక్షన్లలో అతుక్కపోయి రూపాయి తీసుకోకుండా విధులు నిర్వహించడంపై పలు ఆరోపణలున్నాయి. అంతేగాకుండా ఇంజనీర్ సెక్షన్ లో డైలీ లేబర్ గా చేరిన వారు ఏకంగా వర్క్ ఇన్స్ పెక్టర్లుగా చెలామణి అవుతూ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన వారిని కదపకుండా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను బలి చేయడమేమిటని ప్రశ్న తలెత్తుతున్నాయి. కొత్త కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అంతర్గత బదిలీలను చేపట్టారని ప్రచారం జరుగుతున్నా దాని వెనుక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు వేతనాలు పెంచకుండా అవగాహన ఉన్న సెక్షన్లు ఇవ్వకుండా కొత్త సెక్షన్లకు మార్పిడి చేయడం ఏమిటని ఉద్యోగులు లబోదిబో మంటున్నారు. ఏళ్ల తరబడి చేస్తున్న వారిని కాదని ఇటీవల విధుల్లో చేరిన వారిని అవగాహన లేని వారికి కాసులు కురిపించే సెక్షన్లు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ సెక్షన్లలో పైరవీలు చేసిన వారికి పోస్టింగ్ లు ఇచ్చారని వాదనలున్నాయి. బల్ధియాలో ఏళ్ళ తరబడి అర్హత కలిగినప్పటికీ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ పేరిట తమను చిన్నచూపు చూస్తున్నారని ఇప్పుడే ఏకంగా సెక్షన్లే మార్చి అన్యాయం చేశారని వాపోతున్నారు. కొందరు యూనియన్ నాయకుల పేరు చెప్పి, మరికొందరు అధికారులతో అన్ని రకాల లావాదేవిలు కలిగిన వారికి స్థానచలనంలో ప్రాధాన్యత కలిగిన డిపార్ట్ మెంట్లు ఇచ్చారని వాపోతున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే కష్టపడుతున్నప్పటికీ తమపై వివక్షత కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కమిషనర్ ను పక్కదారి పట్టించి బదిలీ చేయించారనే వాదనలు కూడా లేకపోలేదు. బల్ధియాలో ఇంజనీరింగ్ సెక్షన్ లో ఏళ్ళ తరబడి పాతుకపోయిన వర్క్ ఇన్స్ పెక్టర్ల ముసుగులో ఉన్న వారిని వదిలివేయడం ఏమిటని చర్చ జరుగుతుంది. రెవెన్యూ లో కొందరు ఉద్యోగాల్లో చేరినప్పటి నుంచి పని చేస్తున్నా వారిని కదపలేదని, ఎస్టాబ్లిష్ మెంట్, అకౌంటింగ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. తమతో పాటు అందరికీ న్యాయం చేయాల్సిన అధికారులు వివక్ష చూపడం ఏమిటని వాపోతున్నారు. ఈ విషయంపై యూనియన్ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్దమౌతుంది.

This section changes

More articles

Latest article