- సిసిఎస్ ఎసిపి నాగేంధ్ర చారీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వ్యభిచారం అనే మురికి కూపంలో చిక్కుకుని ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, దాని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ సిసిఎస్, టాస్క్ ఫోర్స్ ఇంచార్జీ ఎసిపీ నాగేంద్రచారీ ప్రజలకు సూచించారు. నిజామాబాద్ సిసిఎస్ ఎసిపీ కార్యాలయంలో ఆయన బుదవారం విలేఖరులతో మాట్లాడుతు…. సమాజంలో జరుగుతున్న వ్యభిచారం ( ప్రాసిట్యూషన్) పై పోలీస్ శాఖ జరుపుతున్న దాడులలో అమాయకులు కొందరు అందులో చిక్కుకున్నట్లు గుర్తించామని తెలిపారు. ఆర్థిక స్థితిగతులను ఆసరగా చేసుకునే కొందరు కుటుంబ సభ్యులే వ్యభిచారం అనే రొంపిలో దింపుతుండగా, మరికొందరు వారికి తెలిసిన ఇరుగు పొరుగు వారే వివాహితలను, యువతులను అందులోకి లాగుతున్నారని అన్నారు. అదే సమయంలో ప్రేమ పేరిట కొందరు వారు ప్రేమించిన వారిద్వార లేదా హ్యుమన్ ట్రాఫికింగ్ ( మానవ అక్రమ రవాణా) బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరిని వ్యభిచార రొంపిలోకి దిగడానికి బ్లాక్ మేయిల్ పద్ధతులు వాడే అవకాశం వివాహితలు, యువతులు, విద్యార్థినిలు అప్రమత్తంగా ఉండాలని ఎసిపీ కోరారు. వ్యక్తిగత జీవితం రోడ్డున పడిన రోజున ఏదైనా జరుగవచ్చని కాబట్టి ఎవ్వరికి వారు తమ జీవిత గమనాన్ని నిర్ధేశించుకోవాలని ఎసిపి నాగేంద్ర చారీ అన్నారు. జిల్లాలో వ్యభిచారం, మానవ అక్రమ రవాణాల గురించి స్థానిక పోలీసులకు, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని ఎసిపీ పేర్కొన్నారు.
