29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

డెయిరీ టిప్.. దొంగలెక్కల్లో టాప్ 

Must read

📰 Generate e-Paper Clip

  • తీర్మాణం లేకుండానే బిల్లులు డ్రా 
  • మరమ్మత్తుల పేరిట నిధుల భోజ్యం 
  • పెళ్లి కానుకలో గోల్ మాల్ 
  • రైతులకు ఇచ్చింది శూన్యం 
  • ‘విజయ’లో వింతలు, డబ్బు మింగే తంతులు 

నిజామాబాద్, బతుకమ్మ:

హోటల్ కు వెళ్లి తిన్న తర్వాత బేరర్ కు ఇచ్చే టిప్ అనుకుంటున్నారా … కాదండోయ్ …. విజయ డెయిరీలో దొంగ లెక్కలు రాసుకొని దిగమింగే టిప్ ..అండీ ..  రైతులకు ప్రోత్సాహం అందించేలా, కొన్ని సంక్షేమ పథకాలను అందించే బృహత్కర కార్యక్రమం ఇది. గత నాలుగేళ్ళుగా లెక్కలకు పొంతన లేకుండా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దర్జాగా నొక్కేసారు. రైతులకు రాయితీపై ఇవ్వాల్సిన వాటిని, వారికి తెలియకుండా, కనీసం కమిటీ సభ్యులతో తీర్మానం లేకుండానే  స్వాహా చేసారు. నిధుల దుర్వినియోగంలో ముగ్గురి పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. రైతులతో సమావేశాలు, విత్తనాలు, మినరల్ మిక్సర్, ముద్రణ (ప్రింటింగ్), ఆరోగ్య శిబిరాలు, అనలేజర్, ప్లాంట్ మరమ్మతుల పేరిట చెక్ లు రాసుకొని నిధుల కైంకర్యానికి తెర లేపినట్లు తెలుస్తోంది.

  • తీర్మాణం లేకుండానే..

టిప్ (టెక్నికల్ ఇన్ పుట్) నిర్వహణ కోసం కమిటీ ఉంటుంది. వీరితో పాటు డెయిరీలోని సంబంధిత అధికారులు సమావేశంలో తీర్మాణం మేరకు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  కమిటీకి తెలియకుండానే ప్లాంట్లో మరమ్మతులు చేయాలని హైదరాబాద్ లోని విభాగం అధికారుల నుంచి అనుమతి తీసుకొని లక్షల నిధులు కాజేసారు. ఇలా రెండేళ్లు  కొనసాగగా మూడో యేడు అనుమానం రావడంతో కొటేషన్ కావాలని అడిగారు. ఎలాగైనా ఈ సారి సైతం ముందటిలాగే నిధులను మింగాలనే దుర్బుద్దితో తెలిసిన వారితో మాట్లాడుకొని కొటేషన్ వేయించేసి స్వాహ చేసారు. ఇందులో కనీసం ప్లాంట్ నిర్వహణ కోసం ఉన్న జూనియర్ ఇంజనీర్ సంతకాలు లేకపోవడం గమనార్హం.

  • పెళ్లి కానుకల్లో..

విజయ డియిరీకి పాలు పోసే రైతుల కుటుంబాల్లో పెళ్లిళ్లు జరిగితే ప్రోత్సాహకంగా రూ. 10 వేలు టిప్ నుంచే ఇస్తుంటారు. ఇందులోనూ అనర్హులకు చెల్లింపులు చేసారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇవ్వకుండానే ఇచ్చినట్లు నిధులు కాజేసారనే అనుమానాలు రైతుల్లో పొడసూపుతున్నాయి.

  • రైతుల సొమ్ము స్వాహా ..

లీటర్ కు 50 పైసల లోపు చొప్పున పాలు పోసే ప్రతి రైతు నుంచి తీసుకొని డెయిరీ ఖాతాలో జమ చేస్తుంటారు. వీటితో విత్తనాలు, మిక్సర్ రైతులకు రాయితీపై ఇవ్వడంతోపాటు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుంటారు.  ఇది చెప్పడానికి, వినడానికి వినసొంపుగా ఉంటుంది … వాస్తవానికి మాత్రం  చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా విజయ డెయిరీలో రైతుల పేరుతో నిధులను మింగేసారు.

  • అనలేజర్ పేరిట..

పాల సాంద్రత తెలిపే పరికరాలను మరమ్మత్తు చేసి విడి బాగాలను బిగించామని బిల్లులను ఆ ముగ్గురు కాజేశారు. వీటి రిపేర్ కోసం అయ్యే ఖర్చులను గ్రామాలలో రైతులే భరించుకున్నప్పటికీ డెయిరీలోని అధికారులు బిల్లులు కాజేయడంతో రైతులు అగ్రహావేశాలు వెళ్ళగక్కుతున్నారు. పని రాని టెక్నీషియన్ ను తొలగించిన మళ్ళీ విధుల్లోకి తీసుకోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

  • దొంగ లెక్కల్లో టాప్..

2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చ్ వరకు.. సమావేశాలకు రూ.17740, విత్తనాల కొనుగోలుకు రూ.1006500, ముద్రణ కోసం రూ.24500, మినరల్ మిక్సర్ కు రూ.72900, …

2020-21 వార్షికంలో వర్ని బిఎంసియుకి ముందస్తు చెల్లింపు రూ.2 లక్షలు, మినరల్ మిక్షర్ కు రూ.166500, మరమ్మతులకు రూ.247600, టెక్నీషియన్ వేతనం రూ. 14600, సమావేశాలకు రూ. 2508, ఆరోగ్య శిబిరాలకు రూ.205000, విత్తనాలకు రూ.370000, అజొల్లబెడ్ కోసం రూ. 5వేలు,

2021-22 వార్షికంలో .. టెక్నీషియన్ వేతనం రూ.182000, మినరల్ మిక్షర్ రూ.137608, మరమ్మతులకు రూ.16400, ఆరోగ్య శిబిరాలు రూ. 50వేలు, మెగా డెయిరీ ప్రారంభోత్సవానికి రూ. 27768, విత్తనాలకు రూ 4 లక్షలు, పెళ్లి కానుకకు రూ. 106000, అనలేజర్ విడి భాగాల కొనుగోలుకు రూ.288746, మందులకు రూ.123016, బ్యాంకు చార్జెస్ రూ.265,

2022లో ఏప్రిల్, మే నెలలో….టెక్నీషియన్ వేతనం రూ. 28వేలు, పెళ్లి కానుక కోసం రూ. 70వేలు ….ఇలా ఒకటేమిటి సందు దొరికితే చాలు డెయిరీ అభివృద్ధికన్నా నిధులు మింగడంలో ఆరితేరిపోయారు.

More articles

Latest article