- డిచ్ పల్లి సర్కిల్ పోలీసులపై అట్రాసిటి కేసు నమోదు చేయాలి
- మోపాల్ ఎస్సైకి కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు
- వివాదాల్లో నిజామాబాద్ సబ్ డివిజన్ లో పోలీసులు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ సబ్ డివిజన్ పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సివిల్ పంచాయితీల్లో వేలు పెట్టి వివాదాల్లో కూరుకపోతున్నారు. సామాన్య ప్రజల వ్యక్తిగత ఆస్తులు, భూముల పంచాయితీలను సెటిల్ మెంట్ చేస్తూ వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ లను సివిల్ పంచాయితీలకు అడ్డాలుగా మార్చుకుని పంచాయతీలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుకుపెట్టుకుని చేస్తున్న అరాచకాలకు ప్రజలు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా న్యాయం జరుగకపోవడంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్ సబ్ డివిజన్ పోలీసు అధికారులపై వరుసగా న్యాయస్థానం కేసులు నమోదు చేయాలని, సివిల్ పంచాయతీల్లో జోక్యం చేసుకోవద్దని కోర్టు ధిక్కరణ ఉత్తర్వులను జారీ చేయడంతో కలకలం రేపుతుంది.
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రానికి చెందిన రావుట్ల ఆలియా రాగుట్ల నచ్చన్న అనే దళితుడికి గ్రామంలో ఎకరం భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన కొందరు గ్రామస్తులు ఆ భూమిలో ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో అక్రమంగా ప్రవేశించడమే కాకుండా గుడి నిర్మాణాన్ని చేపట్టడాన్ని నచ్చన్న అడ్డుకున్నారు. దాంతో వ్యతిరేకులు మారణాయుదాలతో దాడికి వచ్చారు. బాధితుడు జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు.అ యితే పోలీసులు కేసు నమోదు చేయడంలో తాత్సరం చేశారు. అదే సమయంలో అతనికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. అక్కడికి విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ వచ్చి ఏకంగా నచ్చన్నను భూమి వివాదం పెద్దది చేయొద్దని, మీది కాదని వెళ్లిపోవాలని బెదిరించారు. ఈ విషయంపై సర్కిల్ ఇన్స్ పెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. దానితో డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్ పెక్టర్ మల్లేష్, జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్ మహేంధర్ అధికార దుర్వినియోగం లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కోర్టు గతేడాది డిసెంబర్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు వారిపై కేసులు నమోదు చేయలేదు. ఈ నెల 11న బాధితులు పోలీసు అధికారులపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను కమిషనర్ కు అందజేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల , కోర్టు పరిధిలో ఉందని దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు.
మోపాల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో యాదగిరికి కోర్టు ఉత్తర్వుల దిక్కరణ చేశారని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మోపాల్ మండల పరిధిలోని గ్రామంలో 14 ఎకరాల భూమి విషయంలో కొన్నిరోజులుగా వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో భూమి యజమాని బొడ్డు గంగారెడ్డి కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ పొందారు. కానీ గత నెలలో సంబంధిత భూమిపై కబ్జాకు యత్నం జరిగింది. బాధితుడు అక్కడ అడ్డుకునేందుకు వెళ్లగా అతడిపై దాడి జరిగింది. ఈ విషయంలో మోపాల్ పోలీసులు రెండు వర్గాలపై కౌంటర్ కేసులు నమోదు చేశారు. కానీ కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి అక్కడ జరుగుతున్న వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవడాన్ని బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. అంతేగాకుండా ఏకంగా మోపాల్ ఎస్సై బాధితులను బెదిరించి కేసును సెటిల్ మెంట్ చేసుకోవాలని, లేకపోతే జైలుకు పంపుతానని పలుమార్లు బెదిరించారు. ఈ విషయంపై బాధితులు పోలీసు కమిషనర్ తో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ న్యాయం జరుగకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా మోపాల్ ఎస్ హెచ్ వోకు సివిల్ తగాదాలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
