- మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
- నగరంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో తాగునీరు, పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా సుమారు 400 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర ఎక్సయిజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ వెల్లడించారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని రాష్ట్ర డీజీపీ జితేందర్, కలెక్టర్ రాజీవ్ గాంధీతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. బాలికలు, మహిళలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ కేంద్రం గురించి విరివిగా ప్రచారం నిర్వహిస్తూ, మెరుగైన సేవలు అందించాలని, బాధితులకు అండగా నిలుస్తూ వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలని హితవు పలికారు. అనంతరం నిజామాబాద్ నగరంలో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ. 380 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులకు, వరద జలాలు నిలువకుండా చేపడుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. గోల్ హనుమాన్ వద్ద నిర్మించిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, నగర ప్రజలకు ఇది పండుగ వాతావరణం అని హర్షం వెలిబుచ్చారు. వచ్చే యాభై సంవత్సరాల వరకు కూడా పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీరు, పారిశుధ్య సమస్య తలెత్తకుండా సుమారు 400 కోట్ల రూపాయల నిధులతో మంచి నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చే పనులతో పాటు శానిటేషన్ దుస్థితిని దూరం చేసేలా భూగర్భ డ్రైనేజీ పనులను చేపట్టడం జరుగుతోందన్నారు. ఏడాదిన్నర కాలంలో ఈ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టు ఏజెన్సీలను ఆదేశించారు. తాగునీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకే రూ. 217 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. ఇందులో కేంద్రం వాటా 33 శాతం కాగా, రాష్ట్ర ప్రభుత్వం 59.23 శాతం నిధులను వెచ్చిస్తోందని, 14వ ఆర్ధిక సంఘం ద్వారా 14.97 శాతం నిధులు మంజూరవగా, స్థానిక నగర పాలక సంస్థ 10 శాతం నిధులు భరిస్తుందని వివరించారు. ఈ నిధులతో అలీసాగర్ వద్ద 25 ఎం.ఎల్.డీ సామర్ధ్యంతో కూడిన స్టోరేజ్ ట్యాంకులు నిర్మిస్తున్నారని, ప్రతి రోజు 2.5 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసి నగర ప్రజలకు రక్షిత జలాలు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న మంచినీటి ట్యాంకులకు అదనంగా ఆయా ప్రాంతాలలో అదనంగా మరో 18 ట్యాంకులను నిర్మిస్తున్నారని అన్నారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజ్ పనులను పూర్తి చేసేందుకు మరో 162 కోట్ల రూపాయలను మంజూరు చేయించామని తెలిపారు. గడిచిన పదేళ్లలో స్తంభించిపోయిన అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం శరవేగంగా చేపడుతూ, ప్రజలకు మౌలిక వసతులను మెరుగుపర్చే పనులను చేపడుతోందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మబలిదానాలు, త్యాగాలను చూసి చలించిన నాటి యూ.పీ.ఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేశారని గుర్తు చేస్తూ, స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన ఫలితంగా ప్రతీ నెల వడ్డీ రూపంలోనే 6500 కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని ఆక్షేపించారు.

అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. రైతులకు లబ్ది చేకూర్చేందుకు 21 వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేశామని, మరో 21 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని వివరించారు. ఒక్క నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం 175 కోట్ల రూపాయలను వెచ్చిచనున్నామని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు కూడా ప్రభుతం ఈ నెల 26 నుండి శ్రీకారం చుడుతోందని అన్నారు. కేవలం ఏడాది కాలంలోనే ఇన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన తమ ప్రభుత్వం, రానున్న నాలుగేళ్లలో మరింత విస్తృత స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనుందని తెలిపారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు పలువురు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. కాగా, ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని, యోగా, వ్యాయామానికి తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని మంత్రి జూపల్లి హితవు పలికారు. అనవసర ఆడంబరాలకు పోయి వేడుకల పేరుతో కష్టార్జితాన్ని వృధా చేసుకోకూడని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన బోధన అందిస్తున్న ప్రభుత్వ బడులలో పిల్లలను చదివిస్తూ డబ్బులను ఆదా చేసుకోవాలని జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమాల్లో శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, జోన్ ఐ.జీ చంద్రశేఖర్ రెడ్డి, ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ, నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ కేశ వేణు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

