బతుకమ్మ,మోర్తాడ్: తలాపాపునకు నీరు ఉన్న తడి అరని గొంతు అన్నట్టుగా చౌట్ పల్లి హనుమంతు రెడ్డి ఎత్తిపోతల పథకం క్రింద ఉన్న చెరువుల పరిస్థితి ఉంది. ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్న నీటి విడుదల జరుగుతున్న ఎత్తిపోతల పథకం రెండు పైపులై లీకేజ్ వల్ల నీటి విడుదల నిలిచిపోయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లక్ష్మీ కాల్వ ద్వారా స్థానిక నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్, కమ్మర్ పల్లీ మండలాల్లోని ఆయకట్టు భూములకు సాగునీరు అందించడం కోసం మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామ శివారులో చౌట్ పల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. చౌట్ పల్లీ హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం 57 కిలోమీటర్ల పొడవు పైపు లైన్ వేశారు. మొత్తం నాలుగు పైపులైన్లు ఉండగా ప్రస్తుతం మోర్తాడ్ , చౌటుపల్లి రెండు పైపులైన్ల ద్వారా మాత్రమే నీటి విడుదల జరుగుతుంది. తిమ్మాపూర్ , కమ్మర్ పల్లీ రెండు పైపులైన్ల ద్వారా నీటి విడుదల జరగడం లేదు.
అక్కడక్కడ లీకేజీ..
మోర్తాడ్, చౌట్ పల్లీ రెండు పైపు లైన్ ద్వారా నీటి విడుదల చేస్తున్నారు కానీ పంప్ హౌస్ జీరో పాయింట్ దగ్గర నీరు లీకేజ్ జరుగుతుంది. అలాగే మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామ శివారులో రెండు చోట్ల పెద్ద సైజులో లీకేజీలు ఉన్నాయి. వడ్యాట్ గ్రామంలో అక్కడక్కడ చిన్న చిన్న లీకేజీలు ఉన్నాయి. శేట్ పల్లీ, ధర్మోరా గ్రామా శివారులో మధ్య ఒక చోట లీకేజీ ఉండడంతో పలుచోట లీకేజీ ఉండడంవల్ల నీటి విడుదలను నిలిపివేశారు.
భూగర్భ జలాలు పెరుగుతాయి..
హనుమత్ రెడ్డి ఎత్తిపోతల పథకం కింద మోర్తాడ్, కమ్మర్ పల్లీ రెండు మండలాల్లో మొత్తం 28 చెరువులు నింపడం జరుగుతుంది. ఎత్తిపోతల కింద 8,297 ఎకరాల ఆయకట్టు ఉంది.
పూర్తిస్థాయిలో ఎత్తిపోతల పథకంలోని నాలుగు పైపు లైన్ ల ద్వారా నీటి విడుదల చేసి 28 చెరువులు నింపినట్లైతే గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోరు బావుల ద్వారా వ్యవసాయం చేసుకునే రైతులకు నీటి కొరత లేకుండా ఉంటుందని తద్వారా పంటలు పుష్కలంగా పండుతాయని రైతులు అనుకుంటున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయో లీకేజీలని వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేసి మిగిలిన రెండు పైపుల ద్వారా కూడా నీటి విడుదల చేయాలని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో మరమ్మత్తులు చేసి నీటి విడుదల చేస్తాం
సురేష్ (డీఈఈ) నీటిపారుదల శాఖ.
మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్, కమ్మర్ పల్లీ పైప్ లైన్లకు లీకేజీలు ఉన్న విషయం వాస్తవం. కావున త్వరలో పైప్ లైన్ లీకేజీలకు మరమ్మత్తుల పనులు పూర్తి చేసి ఈ రెండు లైన్ల ద్వారా కూడా నీటి విడుదల చేసి గ్రామాల్లోని చెరువులను నింపుతాము.

