- జనవరి 11 న సంస్మరణ సభ ను విజయవంతం చేయండి
- సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా
నిజామాబాద్, బతుకమ్మ : గొర్రెపాటి మాధవ రావు పోరాట స్ఫూర్తి తో ఉద్యమిద్దామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా పిలుపునిచ్చారు. మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు,ప్రముఖ సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను ద్వారక నగర్ గుడిసె వాసుల సంఘం ( ఇఫ్టు అనుబంధం) ఆద్వర్యంలో సోమవారం ఐఎఫ్టీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభకు న్యూడెమోక్రసీ నగర నాయకులు నర్సింగ్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా మాట్లాడుతూ గొర్రెపాటి మాధవరావు గొంతులేని పేద బడుగు బలహీనవర్గాలకు, తాను గొంతై వారి హక్కుల కోసం ఉద్యమించారని తెలిపారు. నగరంలోని ద్వారక నగర్ గుడిసె వాసుల కోసం, శ్రామిక నగర్ గుడిసె వాసుల కోసం, పేదల ఇళ్ల స్థలాల కోసం కోర్టుల్లో పోరాడారని, వారికి ఇళ్ల స్థలాలు ఇతరత్రా సౌకర్యాలు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య కు న్యాయ సలహాదారుడుగా ఉంటూ శ్రామికుల పక్షాన అనేక వేతన ఒప్పందాలకు మార్గదర్శకత్వం చేశారని శ్రామికుల కేసులను కోర్టులో ఉచితంగా వాదించారని తెలియజేశారు. బీడీ కార్మికుల రక్షణ కోసం, వారి వేతన పెంపుదల కోసం యజమాన్యాలతో పూణే, ఔరంగాబాద్, మహారాష్ట్రలో స్వయంగా వేతన చర్చల్లో పాల్గొని బీడీ కార్మికుల పక్షాన నిలిచారని వారి కోసం కోర్టుల్లో ఉచితంగా వాదించారని చెప్పారు. న్యాయవాదిగానే కాకుండా ప్రజల పక్షపాతిగా ఉంటూ అనేక సామాజిక సమస్యలపై రచనలు చేశారని, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారని తెలియజేశారు. కామ్రేడ్ గొర్రెపాటి మాధవరావు మరణం పీడిత తాడిత ప్రజానీకానికి శ్రామిక వర్గానికి తీరనిలోటు అని వారి ఆశయ సాధనకు అంకితం అవ్వడమే వారికి ఇచ్చే నివాళి ఆని అన్నారు. ఈనెల 11వ తేదీన నగరంలోని ఎల్లమ్మ గుట్టలో జరిగే మాధవరావు గారి సంస్మరణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు శివ కుమార్,రమేష్, కుమార్, శాంతమ్మ, బాలమ్మ, చంద్రమ్మ, శేఖర్, పరుషురములు,బాగ్య,తదితరులు పాల్గొన్నారు.
