- ఉమ్మడి జిల్లాలో దళితుల నుంచి వినతుల స్వీకరణ
- ఎస్సీ వర్గీకరణ అధ్యాయనం కోసం కమిటి పర్యటన
- వినతులు సమర్పించేందుకు సిద్దమైన దళిత సంఘాలు
బతుకమ్మ, నిజామాబాద్ : ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ జిల్లాలో పర్యటించనుంది. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో ఉపవర్గీకరణ,వివరణాత్మక అధ్యయనం కోసం వస్తుంది. నిజామాబాద్,కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై ఏక సభ్య కమిషన్ తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టీస్ డాక్టర్ షమీమ్ అక్తర్ కు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎస్సీ కులానికి చెందిన ప్రజాప్రతినిధులు,గెజిటెడ్,నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు,షెడ్యూల్డు కుల సంఘాల నాయకులు,ఇతర ఉద్యోగులు,ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన అన్ని వర్గాల వారు హాజరై ఏకసభ్య కమిషన్ కు తమ తమ వినతులు అందజేయవచ్చు. ఆగస్టు 1, 2024 రోజున సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును అమలు చేయడం కోసం అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నియమితులైన ఏకసభ్య కమిషన్ అందుకు సంబంధించిన విషయాన్ని పరిశీలించి ఇచ్చే నివేదిక సామాజిక న్యాయానికి అనుగుణంగా ఉండాలని కోరుతూ కొందరు, వ్యతిరేకించే వారు కూడా తమ వినతులను అందించే అవకాశం ఉంది. 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఏర్పడినప్పటి నుండి షెడ్యూల్ కులాలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను , రాజ్యాంగ ఫలాలను ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు అందించేందుకు పోరాటం చేస్తుంది. సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం ప్రధానంగా విద్య ఉద్యోగ రంగాల్లో రావలసిన హక్కులను అన్ని ఎస్సీ కులాలకు అందించేందుకు కృషి జరిగింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎస్సీలందరినీ ఒకే వర్గంగా భావించడం వల్ల వారికి కేటాయించిన 15% రిజర్వేషన్లలో మాదిగ కులంతో పాటు దక్కలి,చిందు,మాస్తి,మోచి,బుడగ జంగాల,హోలియ, దాసరి,నేతకాని వంటి మాలేతర ఇతర షెడ్యూల్ కులాలకు తమ తమ న్యాయమైన వాట దక్కకపోవడంతో గత 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తన అసంతృప్తి,నిరసనను వ్యక్తం చేస్తుంది. 1951 రాష్ట్రపతి ఉత్తర్వులలో పేర్కొన్న 59 షెడ్యూల్డ్ కులాలు సజాతీయమైనవి కావని దళితుల్లో కూడా ప్రత్యేకమైన,విభిన్నత కలిగిన కులాల సమూహాలని మేము తెలియజేస్తున్నాయి.ఈ కులాలలో మాదిగ కులం రాష్ట్రంలో 70% గా అతిపెద్ద జనాభా కలిగిన ప్రత్యేక కులంగా ఉందని, మొత్తం షెడ్యూల్ కులాల జనాభాలో 70% ఉన్నప్పటికీ మాదిగలు విద్య,ఉద్యోగ రంగాలలో అత్యంత వెనుకబడ్డారని అంతేకాకుండా 59 షెడ్యూల్ కులాల మధ్య కూడా స్పష్టమైన అసమానతలు విద్య,ఉద్యోగ రంగాలలో నెలకొన్నాయని వారు వాదనలు వినిపిస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను 59 షెడ్యూల్ కులాలలో ఒక కులానికి మాత్రమే అగ్రశ్రేణి ఉద్యోగాలలోను,డాక్టర్లు,ఇంజనీర్లు మొదలైన అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అలాగే విద్యారంగంలోనూ అత్యధికంగా వినియోగించుకుంటుందని,అలాగే గ్రూప్ 1,గ్రూప్ 2 పోస్టులతో పాటు అన్ని రకాలైన విద్య,ఉద్యోగ అవకాశాల్లో కూడా 70% రిజర్వేషన్లను పొందుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎస్సీలలో ఉమ్మడి రిజర్వేషన్ విధానం కొనసాగింపు వలన మాదిగలతో పాటు ఇతర షెడ్యూల్ కులాలు తీవ్రంగా నష్టపోయాయి. 1991 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో (తెలంగాణతో సహా) షెడ్యూల్ కులాలకు వచ్చిన ఉద్యోగాల్లో 70% కు పైగా ఒకే కులానికి చెందిన వారికే. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అతిపెద్ద జనాభా గల మాదిగ కులం వారికి 22% మిగిలిన షెడ్యూల్ కులాల వారికి కేవలం 8% మాత్రమే వచ్చాయి. ఈ విధంగా రిజర్వేషన్ ఫలాల అసమాన పంపిణీ జరిగింది. దీని కారణంగానే 1994 సంవత్సరంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆవిర్భవించి,ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్లను వర్గీకరించాలనే డిమాండ్ తో ఉద్యమాన్ని చేపట్టింది. 1996 లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మాదిగలు చేసిన పోరాట ఫలితంగా ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వెయ్యడం జరిగింది. ఆ తర్వాత జస్టిస్ రామచంద్రరాజు రాష్ట్రం మొత్తం తిరిగి మాలలు,అది ఆంధ్రలు తప్ప మిగతా ఏ ఎస్సీ కులం కూడా రిజర్వేషన్లు అందుకోవడంలో ముందుకుపోలేదని,ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసి అన్ని కులాలకు సమాన న్యాయం చెయ్యాలని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల హేతుబద్ధీకరణ చట్టాన్ని 2000 సంవత్సరంలో తీసుకొచ్చి వర్గీకరణను అమలు చెయ్యడం జరిగింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా మాలలు సుప్రీం కోర్టుకు వెళ్లి కొట్టివేయ్యించడం జరిగింది. మళ్ళీ ఎమ్మార్పీఎస్ విరోచితమైన పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వంచే 2007 సంవత్సరంలో జస్టిస్ ఉష మెహ్రా కమిషన్ వేయించుకోవడం జరిగింది. మాలలు మాత్రమే వారి జనాభాకు మించి తమ అవకాశాలు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ ఉష మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 59 ఎస్సీ కులాలలో 70 శాతం జనాభా కలిగిన ఏకైక అతి పెద్ద కులం మాదిగలు ఉపకులాల వారు. కానీ ఇప్పటివరకు మాదిగలమైన మాకు 70 శాతం వాట విద్య,ఉద్యోగ రంగాలలో దక్కలేదు. అందువల్ల మాదిగల జనాభాకు తగ్గ 70 శాతం వాటా మాత్రమే కోరుతున్నారు. మాదిగలుగా మేం ఎస్సీలలోని ఏ కులం యొక్క అవకాశాలు కోరడం లేదని, అలాగే మా 70% వాటాను తగ్గించవద్దని కోరుతున్నారు. ఇంతకాలం కొనసాగిన అసమాన పంపిణి వల్ల ఏర్పడిన అసమానతలు తొలగించేందుకు ఎస్సి వర్గీకరణ మాత్రమే ఏకైక పరిష్కారం అని విశ్వసిస్తున్నారు.
