30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

. మెరుగైన విద్య, వైద్యంతో సామాజిక భద్రత కల్పిస్తాం

. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

. రెంజల్ లో పీహెచ్ సీ ప్రారంభం

నిజామాబాద్, బతుకమ్మ: .  వైద్య సేవల కోసం పేదలు అప్పుల పాలు కాకుండా, అభద్రతాభావానికి గురికాకుండా అన్ని విధాలుగా ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెరుగైన విద్య, వైద్యంతో ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా 90శాతం వరకు ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్ సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తూ, పీ.హెచ్.సీలను సీ హెచ్ సీలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకా 300 పైచిలుకు హెల్త్ సబ్ సెంటర్లు, 300 పైచిలుకు హెల్త్ సబ్ సెంటర్లు, 170 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. గ్రామీణ మారుమూల ప్రాంతాలతోపాటు ఆదివాసీ ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. అత్యవసర సమయాల్లో అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఇటీవలే 213 నూతన అంబులెన్స్ లను ప్రజలకు అంకితం చేసిందని గుర్తు చేశారు. ఇంకనూ మరో 85 వరకు అంబులెన్స్ లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. 102 అమ్మఒడి వాహనాలు కూడా ఆయా ప్రాంతాలకు సమకూరుస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు వీలుగా జాతీయ రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని, వాటికి అంబులెన్స్ లను అనుసంధానం చేస్తామని తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు క్యాన్సర్ చికిత్స కేంద్రాలతోపాటు వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్ లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి రూ.10 లక్షల రూపాయల వరకు పెంచుతూ, అనేక రకాల చికిత్సను కొత్తగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. అదనపు లేబరేటరీలను ఏర్పాటు చేస్తూ, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లను నూతనంగా నియమిస్తున్నామని వివరించారు. అవసరం అయిన చోట ఐవీఎఫ్ సెంటర్లను కూడా నెలకొల్పుతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజా సంక్షేమం, వారి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ముందుకెళ్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండదండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Health security is the goal of the government

More articles

Latest article