- ఆరా తీస్తున్న సిఎండి
- అకాల బదిలీ భయం
- ఆందోళన మొదలు
- అవమానంలో పెద్దలు
నిజామాబాద్, బతుకమ్మ: విద్యుత్ శాఖ పరంగా ఏర్పాటైనా డిచ్ పల్లి డివిజన్ ను వద్దంటున్న ఉద్యోగులు త్వరలో అకాల బదిలీ బహుమానాన్ని కంపెనీ సిఎండి నుంచి అందుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. డివిజన్ పై రాజకీయ తెరలేపిన వారి గురించి కంపెనీ సిఎండి, ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. నిఘా విభాగం వారు ప్రభుత్వానికి పంపించిన నివేదిక ప్రకారం గాకుండా మరో కోణంలో సమాచారం సేకరిస్తున్నారు. దీని ఆధారంగా బాద్యులను వేరే జిల్లాలకు పంపించే యోచనలో ఉన్నారని కాంపౌండ్ లో చర్చ జరుగుతోంది. కాంపౌండ్ లో పాతుకుపోయిన ఉద్యోగులు వేస్తున్న ఎత్తుగడలను ఎత్తి చూపుతూ “డిచ్ పల్లి డివిజన్ పై ఉద్యోగుల రాజకీయం” అనే కథనం “బతుకమ్మ”లో వెలువడింది. దీనిపై శుక్రవారం సాయంత్రం ఉద్యోగ సంఘాల బాద్యులు జిల్లా అధికారిని కలిసారు. సిఎండి ఆదేశాలను తప్ప మీ మాటలు వినేది లేదని ఎస్ఈ ఖరాఖండిగా చెప్పారు. దీనితో చేసేది లేక మళ్ళీ సోమవారం సమావేశం కావాలని బాద్యులు నిర్ణయించుకున్నారు.
అకాల బదిలీ భయం
డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటును తొందరగా గావించాలని సిఎండి ఆదేశిస్తున్నారు. ఈ ప్రక్రియ మొదలైనప్పటినుంచి కాంపౌండ్ లో ఉన్న పని లేని పెద్దలు దీనిని అడ్డుకునే ప్రయత్నానికి ఒడిగట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయమే నగరంలో ఉందని, దీనిననుసరించి డిచ్ పల్లి డివిజన్ ను సైతం కాంపౌండ్ లోనే ఉంచుతామని కొన్ని ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చి ప్రణాళికలను రచించాయి. సెక్షన్ లను వీరికి అనుకూలంగా మార్పిడి చేసి సిఎండికి అందజేసారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అనుమతి లేకుండానే సంఘ పెద్దలు చేస్తున్న తప్పిదాలు ” బతుకమ్మ” బహిర్గతం చేసింది. దీంతో అత్యవసర సమావేశానికి రావాలని ఉద్యోగ, కుల సంఘాలకు పిలుపునిచ్చారు. సమావేశంలో డిచ్ పల్లి లోనే డివిజన్ ఏర్పాటు చేయాలని 327, టిఆర్వికెఎస్, బిసి సంఘాలు స్పష్టం చేసాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే జిల్లాకు ఒకరిని బదిలి చేసే అవకాశాలు ఉండవచ్చని ఈ మూడు సంఘాల ప్రతినిధులు తం అభిప్రాయాలను వెల్లడించి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలిసింది.
రూరల్ ఎమ్మెల్యే ఆగ్రహం
డిచ్ పల్లి డివిజన్ కాదని నిజామాబాద్ రూరల్ పేరిట పేరిట రాజకీయం చేస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారికి ఫోన్ చేసారని సమాచారం. తన నియోజకవర్గంలో మంజురైన డివిజన్ గాకుండా మార్పులు, చేర్పులు చేస్తే సహించేది లేదని చెప్పినట్లు తెలిసింది. గాని ఉద్యోగులు వారి సౌలభ్యం కోసం చూసుకోకుండా వినియోగదారులకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలని విద్యుత్ శాఖ అధికారికి ఎమ్మెల్యే సుతిమెత్తగా సూచించినట్లు తెలిసింది.
ఆందోళన మొదలెట్టిన సిబ్బంది
నిజామాబాద్ రూరల్ వద్దు … డిచ్ పల్లి ముద్దు అంటూ ఓ అండ్ ఎం సిబ్బంది చరవాణిలలో ఆందోళన మొదలెట్టారు. ఆర్మూర్ డివిజన్ లో చాల మంది కామారెడ్డి జిల్లాకు చెందినవారు ఉన్నారు. డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటు అయినట్లయితే అక్కడికి వెళ్తామనే ఆలోచనలో ఉన్నారు. కాంపౌండ్ లో ఉన్న పనిలేని ఉద్యోగుల కుటీల రాజకీయాల వల్ల రెండేళ్ళ కింద మంజురైన డివిజన్ ను పూర్తి స్థాయిలో రూపకల్పన చేయకపోవడంతో పదోన్నతులు తీసుకున్నవారికి అన్యాయం జరుగుతోంది. సిబ్బందిని నింపాలనుకుంటే ఆర్మూర్ డివిజన్ వారికి ఆప్షన్ అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. వీరికి తోడుగా రైతులు సైతం వరంగల్ లోని సిఎండి కార్యాలయం ఎదుట డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటు కోసం ఆందోళన చేసేందుకు ప్ల కార్డులు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.
అవమానంలో పెద్దలు
తమ వెనుక సంఘాలు ఉన్నాయని ఏది చేసినా చెల్లుతుందని భ్రమించిన కొన్ని సంఘ పెద్దలకు అవమాన భారం మొదలైంది. ఇందులో రాజకీయానికి తెరలేపిన వారిలో కొందరు పనిలేక ఉంటే ఇంకొందరు సకల సౌకర్యాలు పొందేవారు ఉన్నారు. డివిజన్ స్థాయిలో పనిచేసే ఓ అండ్ ఎం సిబ్బంది విరమణ వరకు అక్కడే విధులు నిర్వహించాలి. ఇలాంటివారిని పరిగణనలోకి తీసుకోకుండా కొందరి ప్రయోజనాల కోసం డిచ్ పల్లి డివిజన్ ను మార్చాలని చూస్తుండడంతో తిరుగుబాటు మొదలయ్యింది. కొన్ని సంఘాలు తప్పుకునే విధంగా సమావేశంలో ప్రవర్తించడంతో నాయకత్వ భాద్యతలను మోస్తున్న వారికి ఉహించని పరిణామాలు ఎదురు కాబోతున్నాయి. డిచ్ పల్లి గాకుండా నిజామాబాద్ రూరల్ పేరు తో స్థానికంగా, శాశ్వతంగా ఉంచుతామని ముందుకు వచ్చిన పెద్దలు అవమానకరంగా భావించుకొంటున్నట్లు తెలుస్తోంది. పర్యావసానం బయటకు రానివ్వకుండా ఆయా నియోజవర్గాలలో డివిజన్లు ఉన్నాయని, రూరల్ పై కమిటి వేద్దామనే ప్రతిపాదనను సంఘాల ముందు ఉంచారు. ఆర్మూర్, బోధన్ డివిజన్ లపై కమిటీలు వేసి వాటిని సైతం కాంపౌండ్ లోనే ఏర్పాటు చేయిస్తే ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళకుండా విధులు నిర్వహించుకోవచ్చనే వ్యంగ్యకరమైన చలోక్తులు సమావేశం అనంతరం వెలువడ్డాయి.
