25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బల్ధియా కార్మికులకు వేతన కష్టాలు

Must read

📰 Generate e-Paper Clip

. పక్షం రోజులవుతున్నా వేతనాలు రాక పస్తులు

. కార్పొరేషన్ లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇబ్బందులు

. 20 నెలలుగా డ్రైవర్ల అలవెన్స్ అందని వైనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతినెల 2న వేతనాలు వస్తుండగా వారితో సమానంగా పని చేస్తున్న  తాత్కాలిక ఉద్యోగులకు సమయానికి జీతాలు అందక నానా కష్టాలు పడుతున్నారు. గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా హయాంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు ఠంచన్ గా వేతనాలు అందేవని, గత కొంతకాలంగా నెల గడిచి 15 రోజులవుతున్నా వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గాని డోక్కాడని పారిశుధ్య కార్మికులు నెల రోజులు చేసిన పనికి వేతనం కోసం 15 రోజులుగా తాము ఎదురు చూస్తున్నా ఉలుకూపలుకు లేదని వాపోతున్నారు. బల్దియాలో అత్తెసరు జీతానికి పని చేస్తున్నా తమకు ఎలాంటి ఇతర ప్రయోజనాలు దక్కడం లేదని కనీసం వేతనం కూడా సమాయానికి అందక కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కార్పొరేషన్ పరిధిలో 1200 మంది అవుట్ సోర్సింగ్, 330 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పని చేస్తున్నారు.  ప్రతి నెలా బల్దియా రెగ్యులర్ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే సమయంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వారికి ఇవ్వకపోవడంతో వారికి కష్టాలు తప్పడం లేదు.  ప్రతి నెలా ఇంటి అద్దె, స్కూల్ ఫీజులు, ఇంట్లోకి నిత్యావసరాల కోసం అప్పులు చేస్తున్నామని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గతంలొ పని చేసిన కమిషనర్ మకరంద్ కాలం నుంచి ఇప్పటి వరకు ఏనాడూ వేతనాలు సమయానికి అందకపోయినా కార్పొరేషన్ అధికారులు, పాలకవర్గం వారి బాధలను పట్టించుకోవడం లేదు. వారి నియామకాలప్పుడు అందినకాడికి దండుకున్న వారు ఇప్పుడు వారికి వేతనాలు అందకపోయినా అడిగే నాథుడే లేకుండాపోయాడు. 2023 మే 1న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బల్ధియాలో పని చేసే టెంపరరీ డ్రైవర్లకు రూ.1000 అలవెన్స్ అదనంగా చెల్లించాలని ఆదేశించి అమలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలో డ్రైవర్లకు అలవెన్స్ ఇస్తుంటే 20 నెలలుగా నిజామాబాద్ లో పని చేసే 130 మంది డ్రైవర్లు అలాంటి ప్రత్యేక నిధులు విడుదల చేయడం లేదు. ఇతర బల్దియాలో ఒక విధంగా నిజామాబాద్ కార్పొరేషన్ అధికారులది మరో దారి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ బల్ధియాలో తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు సకాలంలో రాకపోవడానికి అకౌంటెంట్ విభాగం కారణం అని తెలిసినా ఈ విషయంపై బల్ధియా కమిషనర్ దిలీప్ కుమార్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

More articles

Latest article