బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజీద్ నగర్ గ్రామంలో బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు , జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ హాజరయ్యారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ని పార్టీ నాయకులు శాలువాతో సన్మానించారు. అనంతరం బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దొడ్ల కవిత ప్రభాకర్ రెడ్డి , వైస్ చైర్మన్ కొంగల శంకర్, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన నూతన కమిటీని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

దానికి నిదర్శనం ఈ మధ్య మన నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లు నిదర్శనం అని అన్నారు. అంతేకాకుండా స్పోర్ట్స్ స్కూల్, నర్సింగ్ కాలేజీలను కూడా నియోజకవర్గానికి తీసుకొస్తానని తెలిపారు. నిజామాబాద్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని జుక్కల్ నియోజకవర్గానికి తరలిస్తామని చెప్పారు. అదేవిధంగా నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ నాలా, కౌలాస్ కోట ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గుల్ల గ్రామం నుండి సిరిసిల్ల వరకు హైవే నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. మద్నూర్ నుండి బోధన్ వరకు నేషనల్ హైవే నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఇలా అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్నాని చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ల నియామక ప్రక్రియకు సహకరించిన పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు,ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

