. . . భూ వివాదంలో మాజీ ఎంపీపీ భర్తపై దాడి
. . . సిర్పూర్ శివారులో ఘటన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగర శివారులోని సిర్పూర్ గ్రామంలో నిజామాబాద్ మాజీ ఎంపీపీ భర్త గంగారెడ్డిపై దాడి జరిగింది. బొడ్డు గంగారెడ్డి తన పొలం కౌలుదారు గుండునాయక్ తో కలిసి తన భూమిని కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బుధవారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.అదనపు కమిషనర్ కు, నిజామాబాద్ ఏసీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన గంగారెడ్డితో పాటు కౌలుదారు గుండునాయక్ , గంగారెడ్డి డ్రైవర్ శుభంలపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో గంగారెడ్డి కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. బొడ్డు గంగారెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని కౌలు చేస్తున్న గుండునాయక్ అనే గిరిజనుడి పంటను కొందరు ధ్వంసం చేశారు. ఈ విషయంపై మోపాల్ పొలీస్ స్టేషన్ లో మూడు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. సంబంధిత కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుతో పాటు దాడి కేసు నమోదు జరిగిన ఇప్పటి వరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సంబంధిత కేసు పెండింగ్ లో ఉండగానే అక్కడ భూవివాదంలో మరోసారి దాడి జరుగడం కలకలం రేపింది. దాడికి ముందే పోలీసులు అక్కడికి వెళ్లవద్దని ముందస్తుగా సమాచారం ఇవ్వడం వెనుక దాడి విషయం ముందే తెలిసి ఉంటుందనే విమర్శలున్నాయి.
