25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

విజయ డెయిరీలో షాడో ఎండీ

Must read

📰 Generate e-Paper Clip

. అవుట్ సోర్సింగ్ పై వచ్చిన ఆంధ్ర పీఏదే అధికారం

. ఆయనదే పెత్తనమంతా..

. పీఎస్ నియామకం తర్వాత పీఏ ఎందుకు 

. విజయ డెయిరీలో జీఎంల మండిపాటు

హైదరాబాద్, బతుకమ్మ:  ఆంధ్ర, తెలంగాణా విడిపోయినా విజయ డెయిరీలో మాత్రం పెత్తనం అంతా వారి చేతుల్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. తాత్కాలిక ప్రతిపాదికన నియామకమైన ఉద్యోగి(పీఏ) ఒకరు జనరల్ మేనేజర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే స్థాయికి ఎదిగారు. షాడో ఎండీగా చలామణి అవుతూ సంస్థను శాసిస్తున్నాడు. హైదరాబాద్ లోని విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలోనిది ఈ పరిస్థితి. నూతనంగా వచ్చిన మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అతి కొద్ది కాలంలోనే పరిస్థితిని అవగాహన చేసుకున్నారు. ముందుగా అవుట్ సోర్సింగ్ లో ఉన్న ఆంధ్ర పీఏను పక్కకు పెట్టాలనే ఆలోచనతో అందులోనే జూనియర్ ఇంజినీర్ గా విధులు నిర్వర్తిస్తున్న రెగ్యులర్ ఉద్యోగి రాజశేఖర్ ను పర్సనల్ సెక్రటరీ (పీఎస్) గా నియమించారు. అయితే పీఏ అలాగే కొనసాగుతుండడంపై జీఎంలు మండిపడుతున్నారు. తమనే బెదిరించే స్థాయికి చేరిన సదరు పీఏను తొలగించాలని అంటున్నారు.

ఆయనదే రాజ్యం..

తాత్కాలిక  ప్రాతిపదికన విధుల్లో  చేరిన ఆ ఉద్యోగి డెయిరీకి వచ్చిన మేనేజింగ్ డైరెక్టర్లను మచ్చిక చేసుకొని వారికి పీఏగా చేస్తున్నాడు. సంస్థలో ఉన్నత హోదాలో పని చేస్తున్న వారి బలహీనతలను తెలుసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకునేవాడనే ఫిర్యాదులు షాడో ఎండీపై ఉన్నాయి. తాను ఎంత చెబితే అంతా అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఓ జీఎంపై ఉన్న కేసును ఎండీ తో మాట్లాడి లేకుండా చేశాడనే ఆరోపణలున్నాయి.  తాత్కాలిక ఉద్యోగయినా పీఏను  డెయిరీ  ఎండీ నమ్మడంతో, ఈ అవకాశాన్ని ఆర్థిక వనరుగా మలుచుకున్నాడు. వివిధ విభాగాలలో ఉన్న జనరల్ మేనేజర్లను బెదిరించి డబ్బులు లాగడం మొదలు పెట్టాడు. తన మాట వినని వారిపై ఎండీకి చాడీలు చెప్పి ఇబ్బందులకు గురిచేసేవాడు. తప్పు చేసినవాళ్లు దొరికితే ఇక అంతే.. పీఏ పంట పండినట్లే. వారి నుంచి రూ. లక్షలు వసూలు చేశాడనే ప్రచారం జరుగుతోంది.

బినామీ పేర్లతో ప్రోత్సాహకం

పాడి రైతులకు లీటర్ పాలకు రూ.4 చొప్పున ప్రోత్సహకం(ఇన్సెంటీవ్) ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ఆసరా చేసుకున్న సదరు పీఏ బినామీల పేర్లను రాయించి రెండు సంవత్సరాల పాటు లక్షలాది రూపాయలు కొల్లగొట్టాడని సంస్థ ఉద్యోగులు, సిబ్బందే బహిరంగా చర్చించుకుంటున్నారు.

పీఎస్ వచ్చాక పీఏ ఎందుకు..?

మేనేజింగ్ డైరెక్టర్ కు ప్రభుత్వ ఉద్యోగి పర్సనల్ సెక్రటరీ గా వచ్చిన తర్వాత పీఏ ను కొనసాగించడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎండీ కి చెందిన ప్రత్యేక గదిని తన అన్ని అవసరాలకు పీఏ వాడుకున్నారనే ప్రచారం ఉంది. మహిళా ఉద్యోగులను మానసికంగా హింసించి పైశాచికానందం పొందేవాడనే ఆరోపణలున్నాయి. ఇలాంటి తాత్కాలిక ఉద్యోగిని సంస్థలో కొనసాగించే బదులు శాశ్వతంగా తొలగించడం మేలని డెయిరీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

More articles

Latest article