26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్ పీల నిర్వాకం . . మహిళా  సభ్యులకు శాపం

Must read

📰 Generate e-Paper Clip

.  13 మహిళా గ్రూప్ లపై బ్యాంక్ అనధికార నిషేధం

. లోన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బ్యాంకర్లు

. పొదుపు డబ్బులు రాక ఆర్థిక  కష్టాలు

. మెప్మా పీడీకి ఫిర్యాదు

నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో మహిళా గ్రూప్ ల నుంచి  ప్రతి నెల స్త్రీనిధి, పొదుపు డబ్బులు వసూలు చేసి బ్యాంక్ లో జమ చేసే ఆర్ పీలు చేతివాటాన్ని ప్రదర్శించారు. నగరంలోని  13 డ్వాక్రా మహిళ గ్రూప్ లకు సంబంధించిన డబ్బులు సభ్యుల వద్ద తీసుకుని బ్యాంక్ లో జమ చేయలేదు. దీంతో ఆయా బ్యాంక్ లు స్ర్తీనిధి, పొదుపు డబ్బులు జమ చేయలేదని మహిళా గ్రూప్ లకు సమాచారం ఇవ్వడంతో సభ్యులు లబోదిబోమంటున్నారు. ఈ విషయం కూడా సీవోలు బదిలీ అయిన తర్వాత వెలుగులోకి రావడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. తాము తీసుకున్న  రుణాల తాలుకు వడ్డీ చెల్లించినప్పటికీ  ఆర్ పీ డబ్బులు తీసుకుని బ్యాంక్ లో చెల్లించకపోవడంతో చక్రవడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలోనే మహిళా గ్రూప్ ల సభ్యులు బ్యాంక్ ల చుట్టు చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం వచ్చిన  కొత్త సీవోలు తమకు గతంలో పని జరిగిన దానితో ఎలాంటి  సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. ఆర్ పీలు రుణాలు చెల్లించని వారికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్తే తాము గతంలోనే డబ్బులు చెల్లించామని.. ఇప్పుడు ఇచ్చేది లేదని కొందరు చెబుతున్నారు. మరికొందరు ఆనాడు తమ వద్ద డబ్బులు  తీసుకున్న ఆర్పీ ల వద్దకు వెళ్తే  సభ్యులపై నే ఎదురు తిరుగుతున్న ఘటనలున్నాయి. రాష్ట్ర  ప్రభుత్వం మహిళా గ్రూప్ లకు లక్ష రూపాయల స్త్రీనిధి ఇస్తామని ప్రకటించడంతో అవి తమకు దక్కుతాయో లేదోనని మహిళలు లబోదిబోమంటున్నారు. ఆర్ పీలు, సీవోలు కుమ్మక్కు కావడంతో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక కష్టాలు  ప్రారంభమయ్యాయి. నగరంలోని హమాల్ వాడి, నాందేవ్ వాడలోని బాలాజీ, స్ర్తీనిధి డ్వాక్రా గ్రూప్ లలో జరిగిన అవకతవకలపై ఐద్వా కార్యదర్శి సుజాత మెప్మా పీడీకి ఫిర్యాదు చేశారు. నగరంలోని నవచైతన్య సంఘం, రమా మహిళా సంఘం, శ్రీసాయి  చైతన్య,  శ్రీ నవ్యల  ఇలా 13 సంఘాల సభ్యుల నుంచి  స్ర్తీనిధి డబ్బులు వసూల్ చేసి ఇటు సభ్యులకు ఓచర్లు ఇవ్వకుండా, బ్యాంక్ లో డబ్బులు జమ చేయకపోవడంతో డ్వాక్రా గ్రూప్ లకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. పొదుపు  డబ్బులు కూడా రాకుండాపోయాయి.

అందని రుణాలు

నగరంలోని పలు డ్వాక్రా గ్రూప్ సభ్యులు రుణాల కోసం సీవోలను సంప్రదిస్తే తాము ఇప్పించలేమని, కనీసం బ్యాంక్ మేనేజర్ కు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరినా స్పందించడం లేదని వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లా  కేంద్రంలో బల్దియా పరిధిలో ఈ పరిస్థితి  నెలకొనడం విశేషం.  23 గ్రూప్ లకు ఒక సమాఖ్య ఉండగా వారు కూడా ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. సమాఖ్యలో 13 గ్రూప్ సభ్యుల తాలుకు రుణాల చెల్లింపు, పొదుపు  డబ్బులను ఖాతాలో జమ చేయకపోవడంతో మిగిలిన  పది గ్రూపులపై పడింది. దాదాపు ఒక్కో గ్రూప్ లో పది  నుంచి 20 వరకు సభ్యులు ఉండగా దాదాపు 300పై చిలుకు సభ్యులకు సంబంధించిన సొమ్ము పక్కదారి పట్టిన విషయంపై ఇది వరకు కొందరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళా సభ్యులు మాత్రం తమకు ప్రభుత్వం నుంచి ఇతరాత్ర రుణాలు, పొదుపు డబ్బులు అందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. 

More articles

Latest article