. . . 2016 వరకు సర్కారు భూమి
. . . ప్రస్తుతం పట్టా భూమిగా వెంచర్ ఏర్పాట్లు
నిజామాబాద్, బతుకమ్మ : ధరణి వచ్చిన తర్వాత లాభనష్టాల గురించి ఎంచితే అర్హులకు అన్యాయం, అనర్హులకు న్యాయం అనే పరిస్థితి చాలా సార్లు బహిర్గతమైంది. ధరణిలో ఉన్న కష్టాలు రైతులకు ఇక్కట్లను తెచ్చిపెడితే రియాల్టర్లకు, అక్రమార్కులకు మాత్రం లేని భూమిపై హక్కులను తెచ్చిపెట్టింది. ఈ విషయంపై వందల ఫిర్యాదులు పెండింగ్ లో ఉండగా ధరణిలో పేర్లున్నాయని ప్రభుత్వ భూములు, ఈనామ్ భూములు, శిఖం భూములు, వక్ప్ భూములకు కొత్త యజమానులు పుట్టుకొచ్చారు. ఏకంగా జిల్లా కలెక్టర్ స్థాయిలోనే ఎన్ వోసీలు ఇవ్వడంతో గత ప్రభుత్వ హయంలో భూముల రకాలు మారిపోయాయి. ఇప్పుడు ఈనామ్, శిఖం, ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వెలుస్తున్నాయి. అదే కోవాలోకి చెందింది నిజామాబాద్ నగరంలోని బోర్గాం(పి)లో గల శిఖం భూమి 1954 పూర్వం సేత్వార్ లో స్పష్టంగా సర్కారు భూమిగా పేర్కొనబడింది.
. . . 2019 వరకు ప్రభుత్వ భూమిగా బోర్డు
నగర శివారులోని బోర్గాం జిల్లా పరిషత్ పాఠశాలను ఆనుకుని స్థానికంగా శిఖం భూమి సర్వే నంబర్ 586లో 2.38 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అది కూడా 1954 నాటి సేత్వార్ లో స్పష్టంగా అది సర్కారు భూమిగా శిఖంలో ఉన్నట్లు రికార్డులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ భూమిపై కన్నేసిన ఆ గ్రామానికి చెందిన రియాల్టర్లు సంబంధిత భూమిలో నుంచి స్కూల్ పక్కన గల ప్రధాన రహదారిని మూసివేశారు. స్పష్టంగా సంబంధిత మ్యాప్ లో ప్రధాన రహదారి వరకు ఆ సర్వే నంబర్ లో ఉన్న రోడ్డును మూసివేశారు. గ్రామంలో ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు ముగ్గురు కలిసి గతంలో తమ సర్వే నంబర్ లో ఉన్న భూములను అమ్ముకుని అదే సర్వే నంబర్ లో ఉన్న భూమిగా ప్రస్తుత శిఖం భూమిని పేర్కొంటూ మంత్రాంగం నడిపారు. గతంలో భూ కబ్జా విషయం బహిర్గతం కావడంతో స్థానికంగా ఉన్న కొందరు గ్రామస్తులు సంబంధిత భూమిని జిల్లా పరిషత్ పాఠశాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని అప్పటి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులతో సంబంధిత భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డును ఏర్పాటు చేశారు.

. . . ప్రభుత్వ భూమికి పట్టా భూమిగా ఎలా ఇచ్చారు?
సేత్వార్ లో సంబంధిత భూమి 2.38 ఎకరాలు శిఖం భూమిగా దశాబ్ధాలు రికార్డుల్లో ఉండగా ధరణిలో పట్టా ఎలా వచ్చిందన్న చర్చ జరుగుతుంది. ప్రధానంగా ధరణి వచ్చిన తర్వాత అధికారాన్ని కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మార్వో ద్వారా జరుపడమే కారణమనే వాదనలున్నాయి. ఎన్ వోసీ ద్వారానే ముందుకు అడుగులు పడ్డాయని చెబుతున్నారు. 2019లో ప్రభుత్వ భూమిగా బోర్డు పెట్టిన చోట రెవెన్యూ ల్యాండ్ సర్వే అధికారులు సర్వే చేసి పట్టా భూమికి సిఫారసు వెనుక సీసీఎల్ఏ రూల్స్, ఖాస్రా పహానీలే కారణమని చెబుతున్నారు. దీని వెనుక పెద్ద తతంగమే నడిచిందని, ప్రభుత్వం మారగానే సంబంధిత భూమిపై కన్నేసిన వారు చకచక పావులు కలిపి శిఖం భూమికి పట్టాలు తెచ్చుకుని ఇప్పుడు అక్కడ వెంచర్ ఏర్పాటుకు చుట్టురా కంచె ఏర్పాటు చేస్తున్నారు.

