- ముందస్తు నోటీసులు వచ్చాయంటే డబ్బులు సర్ధుబాటు చేయాల్సిందే
- లేకపోతే స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదు
- ఎస్ హెచ్ వోలకు కల్పతరువుగా మారిన స్టేషన్ బెయిల్
- వారంలో ఇద్దరు ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సైలు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎస్సైలు పైసల కోసం ప్రజలను పీడించుకుతింటున్నారు. ఇప్పటికే ఇసుక, మొరం అక్రమ రవాణాదారుల నుంచి నెలవారి మామూళ్ళు వసూల్ చేస్తున్న అపఖ్యాతి మూటగట్టుకున్నారు. దానికి తోడు జూదం, మట్కా, గుట్కా, ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వాహకులతో కుమ్ముకై మామూళ్ళు వసూల్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అది చాలదన్నట్లు పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు అయిన బాధ్యుడైనా అమ్యామ్యాలు సమర్పించాల్సిందే. పోలీస్ స్టేషన్ లలో బహిరంగంగా వసూళ్ళ కార్యక్రమం కొనసాగుతుంది. ఎస్సైతో పాటు అక్కడ పని చేసే ముదురు సిబ్బందిని పెట్టుకుని స్టేషన్ లను సివిల్ పంచాయితీలు జరిగే అడ్డాలుగా మార్చారని వాదనలున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో స్టేషన్ బెయిల్ కోసం లాయర్ల కన్నా ఎక్కువగా ఎస్సైలే బలవంతపు వసూళ్ళను చేస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వారం రోజుల్లో ఇద్దరు ఎస్సైలు స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతుంది. గురువారం లింగంపేట్ ఎస్సై అరుణ్ స్టేషన్ బెయిల్ కోసం కానిస్టేబుల్ ద్వారా రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ ఈ నెల 8న వర్ని ఎస్సై క్రిష్ణకుమార్ ఏసీబీకి చిక్కాడు.
సామాన్యులు చిన్నచితక కేసుల్లో జైళ్లోకు వెళ్లకుండా ఉండేందుకు లాయర్ల ద్వారా బెయిల్ తెచ్చుకునేవారు. అందుకు లాయర్లు సాధారణ ప్రజలను ఫీజుల పేరిట పీల్చిపిప్పి చేస్తున్నారని న్యాయస్థానం 41 (సీఆర్పీసీ) తీసుకువచ్చింది. 41 సీఆర్పీసీ ప్రకారం ఏడు సంవత్సరాల లోపు శిక్ష కలిగిన కేసుల్లో స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు బెయిల్ ఇవ్వవచ్చు. ఇటీవల బీఎన్ఎస్ఎఫ్ లో అండర్ సెక్షన్ 35(3)గా సీఆర్పీసీని మార్చిన బెయిల్ మాత్రం మంజూరు అధికారం ఎస్సైలకు అప్పగించారు. ఇప్పుడు ఇదే ఎస్సైలకు కల్పతరువుగా మారింది. పోలీస్ స్టేషన్ లలో ఏడు సంవత్సరాల లోపు గల కేసులకు సంబంధించిన వాటిలో బెయిల్ ఇచ్చేందుకు డబ్బుల వసూల్ కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఇప్పటికే సెక్షన్ లను మార్చి నిందితులకు సాయం చేస్తున్నారన్న అపవాదు ఉంది. అది చాలకుండానే ప్రస్తుతం స్టేషన్ బెయిల్ కు కూడా డబ్బులు ఇచ్చిన వారికే బెయిల్ ఇచ్చే కార్యక్రమం సాగుతుంది. ఇటీవల పట్టుబడ్డ కేసులే ఉదాహరణగా చెబుతుండగా గతంలోనూ నిజామాబాద్ జిల్లాలో ఒక సిఐతో పాటు ఎస్సై కూడా ఏసీబీకి చిక్కాడు. ఏసీబీకి దొరికినప్పటికీ అధికారుల తీరు మారడం లేదు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఎస్సైలు పొలిటికల్ లీడర్లతో పోస్టింగ్ లు తెచ్చుకున్నారు. గతంలో పోస్టింగ్ ల కోసం కీలకమైన స్థానాల కోసం లక్షలు సమర్పించుకున్న ఎస్సైలు, సిఐలు, ఏసీపీల వరకు వాటిని రికవరి కోసం బలవంతపు వసూళ్ళ కొరకు ఎగబడ్డారు. కొత్త ప్రభుత్వంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వసూళ్ళ పర్వంలో ఎవరు కూడా ఉన్నతాధికారులను లెక్క చేయడం లేదు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో కమిషనర్ లేని లోటు కనబడుతుంది. అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరువు అవడంతో లోకల్ గా ఉండే ఎస్సైలు అధికారుల మాటను పట్టించుకోవడం లేదు. తాము డబ్బులు పెట్టి పోస్టింగ్ తెచ్చుకున్నామని బరితెగిస్తున్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పది మంది ఎస్సైలు, ఇద్దరు సిఐలు ఇసుక అక్రమ రవాణాలో ఆరోపణలు ఎదుర్కొంటుండగా స్టేషన్ బెయిల్ కోసం లంచావతరాలు ఎత్తడం కలకలం రేపుతుంది.
