27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ : సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో బాన్సువాడ గ్రామీణ మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై గురువారం సంబంధిత అధికారులతో  రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బాన్సువాడ నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారితమని అన్నారు. నియోజకవర్గంలో 70,670 కుటుంబాలు ఉంటే అందులో 66,670 మంది రైతులు.. అంటే 90 శాతం రైతు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం లక్షా యాబై వేల ఎకరాల సాగు భూమి ఉందని అన్నారు. ఇందులో లక్ష ఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టులో ఉన్నదని పేర్కొన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ తన ఆశయం అని, ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా నీళ్ళు అందాలని, ఆర్ధికంగా రైతులు స్థిరపడాలని తన కల అని తెలిపారు. భవిష్యత్తులో సిద్ధాపూర్ రిజర్వాయర్ అయకట్టు సస్యశ్యామలంగా ఉండాలి అనేది తన ఉద్దేశ్యం అని తెలిపారు. రూ. 200 కోట్ల రూపాయల వ్యయంతో, ఒక టిఏంసి కెపాసిటీ తో నిర్మిస్తున్నామని తెలిపారు. రిజర్వాయర్ కట్టతో పాటుగా పొలాలకు నీళ్ళందించే కుడి, ఎడమ కాలువల పని కూడా త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. భవిష్యత్తు తరాల రైతులు సాగునీటికి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకోవాలని తెలిపారు. గిరిజనులు, మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని కష్టపడి సిద్దాపూర్ రిజర్వాయర్ కట్టిస్తున్నామని అన్నారు.

Siddapur Reservoir works should be completed as soon as possible

More articles

Latest article