28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పీడీఎస్ మాఫియాకు రేషన్ బియ్యం

Must read

📰 Generate e-Paper Clip

  • డైరెక్ట్ గా సంచులకు సంచులే అమ్మేస్తున్న డీలర్లు
  • రీసైక్లింగ్ లో ప్రధాన పాత్ర నిజామాబాద్ రేషన్ డీలర్లే
  • పోలీసుల దాడిలో పీడీఎస్ దందా నిర్వాహకుల వద్ద పట్టుబడ్డ రేషన్ బియ్యం సంచులు

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో పీడీఎస్ మాఫియాకు రేషన్ డీలర్లకు ఉన్న కనెక్షన్ బట్టబయలయింది. మొన్నటి వరకు రేషన్ దుకాణాల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని పీడీఎస్ నిర్వాహకులు ఇతర సంచుల్లో సర్ధి రవాణా చేసే వారు. కానీ ఈసారి పీడీఎస్ మాఫియా బరితెగించింది. పోలీసులకు, రెవెన్యూ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు నెల వారి మామూళ్ళు ఇస్తున్నామని డైరెక్ట్ గా రేషన్ బియ్యంను ప్రభుత్వ గోదాముల నుంచి వచ్చే సంచుల్లోనే తరలించి రీసైక్లింగ్ కు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం నేరుగా మిల్లర్లకు లేదా పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న విషయం తెల్సిందే. మంగళవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని కొజ్జకాలనీలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు బోలేరో టెంప్ వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో 30 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అయితే సంబంధిత బియ్యం ఉన్న సంచులు రేషన్ దుకాణంకు ఎంఎల్ఎస్ పాయింట్ (ప్రభుత్వ గోదాం) నుంచి వచ్చే సంచులుగా గుర్తించి షాక్ కు గురయ్యారు. వెంటనే పౌర సరఫరాల, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి రేషన్ దుకాణాల నుంచి నేరుగా తరలుతున్నట్లు గుర్తించారు. నిజామాబాద్ నగరంలో 87 రేషన్ దుకాణాలున్నాయి. దాదాపు లక్ష పై చిలుకు రేషన్ కార్డులున్నాయి. సంబంధిత రేషన్ దుకాణాల నుంచే పీడీఎస్ మాఫియా రేషన్ బియ్యంను సేకరించేది. ఇటీవల వరకు నిజామాబాద్ నగరంలో పీడీఎస్ మాఫియాతో రేషన్ దుకాణాల నిర్వాహకులు కుమ్మకయ్యారు. నగరంలోని పూలాంగ్, బర్కత్ పూర, హైమద్ పూర కాలనీలతో పాటు పీలా స్కూల్ , శాంతినగర్, పెద్దబజార్, గాజుల్ పేట్ తో పాటు శివారు ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల నుంచి నిత్యం రేషన్ బియ్యంను నేరుగా అమ్మేస్తున్నారు. ప్రధానంగా నగరంలో చాలా మంది ప్రజలు రేషన్ బియ్యం తినడం లేదు. వారు బయో మెట్రిక్ మిషన్ పైన తంబ్ వేసిన వారికి కిలోకు రూ.10 నుంచి 10 చెల్లించి వారు మాత్రం రూ.20కు అమ్ముకుంటున్నారు. నిత్యం రేషన్ దుకాణాల నుంచి ఒకటవ తేదిన ప్రారంభమయ్యే ఈ దందా 17వ తారీఖు వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. అందులో భాగంగా నిత్యం వంద టన్నుల పైచిలుకు బియ్యం పీడీఎస్ మాఫియా చేతుల్లోకి నేరుగా వెళ్లిపోతుంది. ప్రభుత్వం పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ కింద పంపిణీ చేసే బియ్యంను కొనుగోలు చేయవద్దని అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెబుతునే 6 ఏ కేసులు నమోదు చేస్తున్నా పీడీఎస్ మాఫియా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అందుకు రేషన్ డీలర్ల వెన్నుదన్నే కారణం. ప్రధానంగా నగరంలోని కొన్ని రేషన్ దుకాణాలు అసలు యజమానుల కంటే బినామీలతో పాటు సబ్ డీలర్లు( పేరు ఒకరు మీదు దుకాణం ఉంటే మరొక్కరు అమ్మకాలు సాగించే ) దుకాణాల నుంచి రేషన్ బియ్యం ఎక్కువగా తరలిపోతుంది. పౌర సరఫరాల శాఖాధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రేషన్ బియ్యంను పట్టుకుని నెలలు గడిచిపోయాయి. కాస్తోకూస్తో పని చేస్తుందంటే మొన్నటి వరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రమే రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ కు తరలకుండా అడ్డుకున్నారు. రేషన్ బియ్యం బహిరంగంగా దొరికితే తాము స్వచ్చంద సంస్థలకు, అనాథ అశ్రమాలకు, మదర్సాలకు డొనేట్ చేసేందుకు సంబంధిత బియ్యాన్ని తీసుకెళ్తున్నామని కేసుల నుంచి తప్పించుకుంటున్న ఘటనలున్నాయి. ప్రధానంగా రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోకపోవడంతోనే వారు పీడీఎస్ మాఫియాతో మిలాఖత్ అయి ప్రభుత్వ బియ్యాన్నిపేదలకంటే గద్దలకే అంటగడుతున్నారు. మొన్నటి వరకు కమిషన్ తక్కువగా ఉందని దొంగ ఏడుపులు ఏడిసిన వారు నిత్యం వచ్చే ఆదాయానికి అనుగుణంగా లాట్ లకు లాట్లే లారీలను లెక్కలు వేసి డంప్ చేసుకోకుండానే నేరుగా అమ్మేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ బియ్యం లెక్కల వారీగా దుకాణాలకు రాకుండా నేరుగా డీలర్లు చెప్పిన లెక్కల ప్రకారం తక్కువ మొత్తంలో డంప్ చేసి మిగిలిన మొత్తాన్ని పీడీఎస్ మాఫియాకే లేదా రైస్ మిల్లర్లకు నేరుగా అమ్మేసుకుంటున్నారన్న వాదనలున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జరుగుతున్న పీడీఎస్ మాఫియాకు రేషన్ దుకాణాల సంఘాల సంబంధించిన పెద్ద తలకాయల అండ ఉందని ఆరోపణలున్నాయి. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 3 టన్నుల రేషన్ బియ్యం దొరకగా పోలీసుల సమాచారంతో వాటిని స్వాధీనం చేసుకుని తాత్కాలికంగా డ్రైవర్ పై కేసునమోదు చేసి బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ కు తరలించినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ నిఖిల్ రాజ్ తెలిపారు. సంబంధిత బియ్యం రేషన్ దుకాణాలవే అని నిర్ధారించారు. డ్రైవర్ ను పట్టుకుని విచారించి వారు ఇచ్చే స్టేట్ మెంట్ ఆధారంగానే కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

Ration rice for PDS mafia

 

More articles

Latest article