నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తున్న ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని, సామాజిక సేవ చేసే స్వచ్ఛంద సంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సందర్శించారు. 13 ఏండ్లుగా నిర్విరామంగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిరంతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందూరు యువత మనశ్శాంతి కోవెల ఆశ్రమ నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నరాల రత్నాకర్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూరు యువత అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాగే నుడా ఛైర్మన్ కేశవేణు మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు మద్దుకూరి సాయిబాబు తమ సంస్థ నిర్వహించే కార్యక్రమాలను సభకు వివరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, యువత తదితరులు పాల్గొన్నారు.
