27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సన్మానాల కోసం బలవంతపు వసూళ్లు

Must read

📰 Generate e-Paper Clip

. ఆర్మూర్ విద్యుత్ డివిజన్ లో వింత

. జమ చేసే బాధ్యత ఏఈలకు

. ఏడీఈ నుంచి ఏఎల్ఎం వరకు ఇవ్వాల్సిందే..

. డీడీఈ మెప్పు కోసం ఆరాటం

ఆర్మూర్, బతుకమ్మ : విద్యుత్ శాఖలో వివాదాస్పదమైన బదిలీల వ్యవహారం సద్దుమణగక ముందే తెరపైకి మరో వివాదం వచ్చి చేరింది. యూనియన్ నాయకులు తమ మార్క్ ను ప్రదర్శించేందుకు సన్మానం పేరుతో బలవంతపు వసూళ్లకు దిగారు. డివిజన్ పరిధిలో చేపట్టిన బదిలీల ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారీతిన పోస్టింగ్ లు ఇచ్చిన అధికారికి సన్మానం చేసేందుకు ఇప్పుడు వసూళ్లకు తెరలేపారు. అయితే సదరు అధికారికి ఒక్కడికి చేస్తే వివాదాస్పదమవుతుందని జాగ్రత్తపడిన నాయకులు బదిలీ అయిన వారందరికీ సన్మానం పేరుతో వసూళ్లకు తెరలేపారు.  ఈ మొత్తం వ్యవహారంలో విద్యుత్ మరమ్మతుల పేరిట భారీగా దండుకున్న ఓ యూనియన్ నాయకుడు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారే ఆరోపణలు వ్యకమవుతున్నాయి. ఇలా లాభం పొందిన కొందరు యూనియన్ నాయకులు డీఈఈని సన్మానించాలనే ప్రధాన ఉద్దేశంతో బదిలీలు అయిన వారందరికీ సన్మానాలంటూ హడావుడి చేస్తున్నారు. అయితే వీరందరి నిర్వాకం వల్లే బదిలీపై వెళ్లిపోతున్న డీఈఈని పిలిపించి సన్మానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ అధికారి ఉన్న సమయంలో జీతం కాకుండా డబ్బులు పక్కకు వేసుకున్న నాయకులే సన్మానమంటూ తమను ఒత్తిడి చేస్తున్నారని కిందిస్థాయి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జమ బాధ్యత ఏఈలకు

సెక్షన్ లలో ఉన్న సిబ్బంది నుంచి సన్మానం నిమిత్తం డబ్బులు వసూలు చేసే బాధ్యతను ఏఈ లకు అప్పగించినట్లు తెలిసింది. విభాగం అధికారి చెబితే సెక్షన్ లో ఉన్న వారంతా యూనియన్ కు సంబంధం లేకుండా ఇస్తారని నాయకులు వ్యూహాన్ని రంచించారు. ఆ దిశగానే సెక్షన్ లో హోదాను అనుసరించి చందా నిర్ణయించారు. ఏఈలు  రూ.5వేలు, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ లు రూ.3వేలు, లైన్ ఇన్స్పెక్టర్లు రూ.2వేలు, లైన్ మెన్ లు రూ.వెయ్యి, ఏఎల్ఎంలు రూ.500 ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆర్మూర్ టౌన్-1, ఆర్మూర్ టౌన్-2, పెర్కిట్, దేగాం సెక్షన్ లలోని మొత్తం సిబ్బంది దగ్గర వసూలు చేయాలని సూచించారు.

నాయకుల ఎత్తుగడ

సిబ్బంది, అధికారుల బదిలీల్లో తాము చెప్పినట్లు విన్న డివిజన్ ఉన్నతాధికారే బదిలీ అవుతారని నాయకులు ఊహించలేదు. ఈ హఠాత్ పరిణాన్ని జీర్ణించుకోలేని నాయకులు డీఈఈకి సన్మానం చేయాలని నిర్ణయించారు. యూనియన్ అంటేనే చీదరించుకునే పరిస్థితి డివిజన్ లో తయారైంది.

ఒక సెక్షన్ లో ఎదురీత

సుమారు ఏడాదిన్నర క్రితం ఒక అధికారి ఇంటా శుభకార్యం జరిగితే సెక్షన్ లోని సిబ్బంది అంతా హాజరయ్యారు. కొన్ని రోజుల అనంతరం దీనికిగాను విందును ఏర్పాటు చేసి ఒక వర్గం వారిని ఆహ్వానించలేదు. ఇదే సెక్షన్ లో సన్మానం కోసం డబ్బులు అడిగితే అప్పుడు విందుకు పనికిరానివాళ్ళం.. ఇప్పుడు తామేందుకు ఇవ్వాలని నిలదీశారు. దీంతో జవాబు చెప్పలేని పరిస్థితిలో నాయకులు ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా కొత్తగా బదిలీ అయినా వారికి సన్మానం చేయడమేంటి..? ఇది నిరంతరం కొనసాగిస్తారా? లేక ఇప్పటికేనా..? అనే ప్రశ్నలు డివిజన్ లో వినిపిస్తున్నాయి.

More articles

Latest article