25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కమిషనర్ లాగిన్ తీసుకునేదెప్పుడు.. పర్మిషన్లు ఇచ్చేది ఎప్పుడు?

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతన ఇంటి నిర్మాణాల కోసం పర్మిషన్లు రాక దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. కొత్తగా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన దిలీప్ కుమార్ ఇప్పటి వరకు లాగిన్ తీసుకోలేదు. టౌన్ ప్లానింగ్ అధికారులకు లాగిన్ ఇవ్వలేదు. దాంతో దాదాపు 150 నుంచి 120 దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి. ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సిన అన్నీ రకాల రుసుములు చెల్లించినా పర్మిషన్లు రాకపోయే సరికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కార్తీకమాసంలో మంచి ముహూర్తాలు ఉండడంతో నూతన నిర్మాణాలకు బల్ధియా పర్మిషన్లు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొన్నటి వరకు కమిషనర్ గా పని చేసిన మంద మకరంద్ హయంలో నిలిచిన అనుమతులు ఇప్పటికి ప్రారంభం కాకపోవడంతో దాదాపు నెల రోజులుగా దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.
. . . ఎమ్మెల్యే ఫంక్షన్ హాల్ నిర్మాణం అనుమతుల విషయమే కారణమా?
నుడా పరిధిలో జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఫంక్షన్ హాల్ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాడు. గతంలో పని చేసిన కమిషనర్ అది నియమనిబంధనలకు విరుద్దంగా ఉందని అనుమతి ఇవ్వలేదు. ఆనాటి నుంచి బిల్డింగ్ పర్మిషన్లు నిలిచిపోయాయని టాక్ ఉంది. ఏకంగా ఒక ఎమ్మెల్యే భవన నిర్మాణానికే అనుమతివ్వకపోవడంతో ఆనాటి నుంచి ఇతర పర్మిషన్లపై ప్రభావం పడిందని సమాచారం. కానీ ఒక ఫంక్షన్ విషయంలో అధికారులు నిర్ణయానికి రాక ఇతర భవనాల నిర్మాణాల అనుమతులను నిలిపివేయడంపై సాధారణ ప్రజలకు ఇబ్బందిగా మారింది. తమ సొంతింటి కలను నిజం చేసుకునేందుకు అన్ని రకాల అనుమతలతో దరఖాస్తు చేసుకుంటే పర్మిషన్లు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్న తలెత్తింది. 60 డివిజన్ల పరిధిలో ఎక్కడైనా అనుమతులు లేకుండా నిర్మాణం చేద్దామంటే అసలే హైడ్రా పేరుతో కూల్చివేస్తారేమోనన్న భయం కూడా ఉంది.
. . . పర్మిషన్ లేకుండా నిర్మించాలంటే . . . కార్పొరేటర్లు, దళారుల భయం
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిల్డింగ్ పర్మిషన్లు నిలిచిపోయి దాదాపు నెల రోజులు గడిచాయి. అన్నీ ఉన్నాయి కదా అనుమతి ఎలాగో వస్తుందని ముందడుగు వేద్దామంటే కార్పొరేటర్లు, దళారుల భయం సామాన్యులను పట్టిపీడిస్తుంది. భవన నిర్మాణానికి పునాదులు పడ్డాయంటే అక్కడ గద్దల్లా వాలి వారి వాటాలు ఇచ్చే వరకు పనులకు బ్రేక్ లు వేయించేది వారే కావడంతో సాధారణ ప్రజలు ఎందుకు వచ్చిన తంటా అని అనుమతులు వచ్చిన తర్వాతనే భవన నిర్మాణాలను ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నారు. తామే పర్మిషన్ల సంగతి చూసుకుంటామని పనులు ప్రారంభించుకోవాలని అందినకాడికి దండుకుని తర్వాత బల్ధియా అధికారులు ప్రధానంగా టౌన్ ప్లానింగ్ వారిని ఉసిగొల్పేది వారే. అందుకే ఇప్పుడు నగరంలో భవన నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్న సామాన్యులు విలవిలలాడుతున్నారు. కొత్త కమిషనర్ లాగిన్ ఎప్పుడు తీసుకుంటాడో, పర్మిషన్ ఎప్పుడు ఇస్తారో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More articles

Latest article