. వేధింపులకు భయపడి ఆత్మహత్యగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు
. గొంతుకు రూమాలుతో ఉరి వేశారని అనుమానాలు
. ఏఎస్సైపై ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ లో పేరు గల్లంతు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ కు చెందిన సయ్యద్ హబీబ్ అజాహర్ ది హత్యా? లేక ఆత్మహత్యనా? అనే నుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 6 అశోక్ సాగర్ చెరువులో అజాహర్ శవమై తేలిన విషయం తెలిసిందే. అతడి మెడలో రూమాలు ఉండడంతో గొంతుకు ఉరివేసి హత్య చేశారనే అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. పోలీసులకు చేసిన ఫిర్యాదులో వేధింపుల కారణంగానే తన భర్త ఆత్యహత్య చేసుకున్నాడని అతడి భార్య ఆస్మా ఆయేషా బేగం ఆరో టౌన పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే ఫిర్యాదులో ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్సైగా పని చేస్తున్న షకీల్ పేరును సైతం ప్రస్తావించారు. తన భర్త అజాహర్.. అర్షద్ అనే వ్యక్తి వద్ద అప్పుతీసుకోగా అతడి మామ షకీల్ వడ్డీల కోసం స్థానిక ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ కు రప్పించి ప్రామిసరీ నోట్ లు రాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరో టౌన్ పోలీసులు మాత్రం పులాంగ్ కు చెందిన అర్షద్ అనే వ్యక్తి వేధింపుల కారణంగానే అజాహర్ ఆత్మహత్య చేసుకున్నాడని అదే రోజు 269/2024 రెండు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ ఐ ఆర్ లో ఏఎస్సై పేరు లేకుండా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్టేషన్ లో బాండ్ పేపర్ రాయించి..
తన అల్లుడి వద్ద తీసుకున్న అప్పుకు వడ్డీలు కట్టాలని ఏఎస్సై షకీల్.. సయ్యద్ హబీబ్ అజాహర్ ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి బాండ్ పేపర్ రాయించడం గమనార్హం. తన పరిధిలో పోలీస్ స్టేషన్ కాకపోయినా సివిల్ మ్యాటర్ లో తలదూర్చిన ఏఎస్సై అజాహర్ ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకున్నారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు ఏఎస్సైపై చర్యలు లేకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
పంచాయితీలు, సెటిల్ మెంట్లు..
సివిల్ పంచాయతీలు పోలిస్ స్టేషన్ లలో పరిష్కరించ బడవు అని తాటికాయంతా అక్షరాలతో రాసి ఉంచే పోలీసు శాఖలో ఆ నిబంధనను గోడలకే పరిమితం చేస్తోంది. చాలా పోలీస్ స్టేషన్ లలో సివిల్ పంచాయితీలు , సెటిల్ మెంట్లు లేకుండా పూటగడవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పలు పోలీసు స్టేషన్ లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా.. పైరవీకారులకు కేరాఫ్ గా మారాయి. దీనికి సయ్యద్ హబీబ్ అజాహర్ మృతి ఉదంతమే ఉదాహరణగా నిలుస్తోంది. పోలీస్ బాస్ లేకపోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారని, తామేమి చేసినా చెల్లుతుందనే ధీమాలో ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మృతుడు సయ్యద్ హబీబ్ అజాహర్ (ఫైల్)
