27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బంగారం కోసమే హత్య

Must read

📰 Generate e-Paper Clip

  • లింగపల్లి వద్ద హత్య కేసును ఛేదించిన పోలీసులు

సదాశివనగర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో గత నెల 30న వెలుగు చూసిన మర్డర్ కేసు మిస్టరీని ఛేదించి  హత్యకు పాల్పడిన ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు  చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు  వెల్లడించారు. కామారెడ్డి  జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో గత నెల 31న గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హతునికి ఒక చేయి లేకపోవడం, ఒక చేతికి అమ్మని పచ్చ బొట్టు ఉండడంతో ఆ కోణంలో విచారణ జరిపారు . హతుడిని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం దర్మారం గ్రామానికి చెందిన క్రిష్ణగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అతని భార్య లావణ్య తన భర్త చివరగా గంగాధర్ అనే వ్యక్తి వద్దకు వెళ్లాడని అతని ఫోన్ నెంబర్ లను పోలీసులకు అందజేసింది. స్థానికంగా 30వ తేదీన సీసీ టీవీ కెమెరా పుటేజీలను పరిశీలించారు .కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం కరడ్ పల్లి గ్రామానికి చెందిన గంగాధర్ ను అనుమానితునిగా అదుపులోకి తీసుకుని విచారించడంతో కేసు కొలిక్కి వచ్చింది. గంగాధర్, క్రిష్ణలు జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో పని చేసే చోట ఏర్పడిన స్నేహం తొమ్మిదేళ్లుగా కొనసాగుతోంది. 2019లో దుబాయ్ కి ఉపాధి నిమిత్తం వెళ్లిన గంగాధర్ అక్కడి నుంచి తీసుకొచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకున్నాడు. మళ్లీ దుబాయ్ వెళ్లేందుకు డబ్బులు లేక పోవడంతో స్నేహితుడైన క్రిష్ణను అతని భార్య లావణ్య వద్ద ఉన్న బంగారం అప్పుగా ఇస్తే తులానికి తులంన్నర చొప్పున ఇస్తానని నమ్మించి నాలుగు తులాల బంగారాన్ని అప్పుగా తీసుకున్నాడు. దుబాయ్ కి వెళ్లకుండ బంగారాన్ని అమ్ముకుని జల్సాలు చేశాడు. బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు భార్యభర్తలను హత్య చేసేందుకు పథకం రచించాడు.క్రిష్ణను దుబాయ్ పంపిస్తానని అందుకు ఇంటి డాక్యుమెంట్లు తీసుకుని కామారెడ్డికి వస్తే లోన్ ఇప్పిస్తానని నమ్మించాడు కానీ క్రిష్ణ ఒక్కడే కామారెడ్డికి రావడంతో సాయంత్రం  వరకు కల్లు  దుకాణాల్లో బెల్టు షాపుల్ల మద్యం తాగించాడు .  తన వద్ద డబ్బులు అయిపోయానని గంగాధర్ క్రిష్ణను నమ్మించి అతని ఫోన్ ఫాస్వర్డ్ తీసుకుని మద్యం కొనుగోలు చేశాడు. అతనికి తెలియకుండానే ఫోన్ ఫే నుంచి రూ.50వేలు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. రాత్రి వేళ లింగపల్లి శివారులోని డంపింగ్ యార్డు వద్ద మద్యం తాగిన క్రిష్ణను వెనుక నుంచి తోసివేశాడు. కింద పడిన క్రిష్ణ తలపై రాయితీసుకుని మోదడంతో అతడు తీవ్ర రక్తస్రావంతో అక్కడే చనిపోయాడు. క్రిష్ణ చనిపోయాడని నిర్దారించుకుని అతని ఫోన్ లో ఆరువేలు మిగిలి ఉండగా తన ఖాతాలోకి ట్రాన్స్ పర్ చేసుకున్నాడు. పోలీసులకు చిక్కకుండా దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించగా సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ రంజిత్ చాకచక్యంగా సాంకేతిక పరిజానంతో గంగాధర్ ను సోమవారం అరెస్టు చేశారని అతని వద్ద నుంచి బైక్, రూ.40వేల నగదు, పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసును నాలుగు రోజుల్లోనే ఛేదించిన పోలీస్ టీం ను కామారెడ్డి ఎస్పీ సిందూశర్మ అభినందించారు.

More articles

Latest article