27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పారిశుధ్య విభాగంలో రా‘బంధువులు’

Must read

📰 Generate e-Paper Clip

. కార్పొరేషన్ లో కనిపించని 330 మంది కార్మికులు

. విధులకు హాజరుకాకుండానే వేతనాలు పొందుతున్న వైనం

. ప్రజాప్రతినిధుల, గులాబీ లీడర్ల కుటుంబ సభ్యుల,అనుచరుల ఇష్టారాజ్యం

. ప్రతి నెలా బల్దియాకు లక్షల రూపాయల భారం

 

నిజామాబాద్ కార్పొరేషన్ పారిశుధ్య విభాగం ప్రజాప్రతినిధుల బంధువులకు అడ్డాగా మారింది. మేయర్ సోదరుడు.. సోదరుడి కొడుకు, బిడ్డతోపాటు ఆమె భర్త మేనల్లుడు, ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఆయన అనుచరుడి తమ్ముడు, మాజీ మేయర్ కొడుకు, సోదరుడుతోపాటు 10 మంది కుటుంబ సభ్యులు.. బీజేపీ కార్యకర్త ఒకరు, ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిన నాయకుడి కుమారుడు, గతంలో ఫ్లోర్ లీడర్ గా పనిచేసి నాయకుడి తనయుడు, సానిటరీ జవాన్ కుమారుడు.. ఇలా ఎంతో మంది బంధుగణం పారిశుధ్య విభాగం నుంచి కార్పొరేషన్  లోని వివిధ విభాగల్లోకి ప్రవేశించారు. ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 500 మందికిపైగా అప్పనంగా జీతాలు పొందుతున్నారు.

 

నిజామాబాద్ , బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై రా‘బంధువు’లు వాలాయి. పారిశుధ్య విభాగంలో తిష్టవేసి ఖజానాను కొల్లగొడుతున్నాయి. పారిశుధ్య విభాగాన్ని అడ్డాగా చేసుకొని ఉద్యోగాలు పొందిన వారు ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, వాటర్ సెక్షన్, డ్రైవర్లు, వ్యక్తిగత సహాయకులుగా నియమితులయ్యారు. నగర పాలక సంస్థలో మొత్తం 1281 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. ప్రస్తుత పాలకవర్గ హయాంలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కార్మికులను నియమించారు. ఇందుకోసం నాలుగైదు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించి 330 మందిని భర్తీ చేశారు. నిజామాబాద్ నగరంలో 60 డివిజన్లు ఉండగా ఐదు సర్కిళ్ల పరిధిలో పారిశుధ్య బాధ్యత అంతా నగర పాలకసంస్థదే. నిజామాబాద్ నగర పాలక సంస్థలో 399 మంది మాత్రమే రెగ్యులర్ ఉ ద్యోగులున్నారు. మిగితా వారంతా తాత్కిలిక  ప్రాతిపదికనే నియమితులయ్యారు. ప్రస్తుత పాలకవర్గం 330 మంది ఉద్యోగులు అవసరమని భర్తీ చేసింది.  అయితే వారందరినీ కార్పొరేటర్ల సిఫారసుల మేరకే తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు ఉచితంగానే ఉద్యోగాలు ఇవ్వగా, ఇతరుల నుంచి రూ.లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. పారిశుధ్య కార్మికుడైతే లక్ష, ఇతర పోస్టుకైతే రూ.2 లక్షల వరకు  వసూలు చేశారు. గత పాలకవర్గం హయాంలోనూ 200 మందికిపైగా భర్తీ చేసినట్లు ఆరోపణలున్నాయి.

ఉద్యోగం ఓకే.. పని చేయాలంటేనే మొహమాటం

పారిశుధ్య విభాగంలో ఉద్యోగల్లోకి ఎక్కిన ప్రజాప్రతినిధులు బంధువులు ప్రతి నెలా ఠంచనుగా జీతాలు తీసుకుంటూ పని చేసేందుకు మాత్రం మొహమాటపడుతున్నారు. దీంతో వారిని వివిధ విభాగాల్లో అడ్జెస్ట్ చేశారు. కొంత మంది ఉద్యోగాలు చేస్తుండగా, మరికొంత మంది తమ స్థానాల్లో వేరొకరితో పని చేయిస్తూ వారికి నెలానెలా ఎంతోకొంత ఇస్తున్నారు. పారిశుధ్య కార్మికులు సరిపోయే సంఖ్యలో లేకపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు, డ్రైనేజీలు, గార్డెన్ లు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. ఇదిలా ఉండగా అసలే విధులకు హాజరుకాకుండా వేతనాలు పొందుతున్న వారికి ఎస్సై(శానిటేషన్ ఇన్ స్పెక్టర్లు) హాజరువేస్తుండడంతో నగర పాలక సంస్థ వేతనాల  రూపంలో లక్షల రూపాయలను ఏజెన్సీలకు చెల్లిస్తోంది. తద్వారా బల్దియాకు ఎలాంటి  ప్రయోజనం లేకుండాపోవడమే కాకుండా నష్టం  చేకూరుతోంది. గతంలో పని చేసిన ఓ ప్రజాప్రతినిధి గులాబీ లీడర్లకు ఆదాయం కోసం ఇష్టం వచ్చినట్లు నియామకాలు  చేయించారనే వాదనలున్నాయి. బల్దియా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి  చూడాలి.

More articles

Latest article