భీమ్ గల్, బతుకమ్మ : జాతీయ సమైక్యత దినోత్సవం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని, పోలీస్ అమరవీరుల వారోత్సవాల ముగింపు సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భీమ్ గల్ మండల కేంద్రంలో 2కే రన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సై సందీప్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాలు, జాతీయ ఐక్యత దినోత్సవం సందర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ ఐక్యత సాధనలో సర్దార్ వల్లభా పటేల్ సేవలు మరువలేనివని, ఆయన ఆశయాలను సాకారం చేయడంలో ప్రతి పౌరుడూ భాగస్వామ్యులు కావాలని కోరారు. దేశంలోని 560 సంస్థానాలను ఏకీకృతం చేసి భారతదేశ ఐక్యతను సాధించారు. ఆయన కృషి ఫలితంగానే మన దేశం ఒక దృఢమైన సమగ్ర రాజ్యంగా నిలిచింది అని పేర్కొన్నారు.యువత దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణలో ముందుండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి మహనీయుల ఆశయాలను అనుసరించాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువత, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

