27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

తొలిరోజు 13 నామినేషన్లు

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
  • గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు..
  • టీచర్స్ స్థానానికి ముగ్గురు..
  • నామినేషన్లు స్వీకరించిన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి

 

నిజామాబాద్, బతుకమ్మ : మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభమైంది. కరీంనగర్ కలెక్టరేట్లో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు, టీచర్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇద్దరు అభ్యర్థులు గ్రాడ్యుయేట్, టీచర్స్ స్థానానికి రెండిట్లోనూ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతొ మొత్తం 13సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో నామినేషన్లను స్వీకరించారు. ఈనెల 10వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి..

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు రెండు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన దూడ మహిపాల్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గవ్వల లక్ష్మి, మేడ్చల్ కు చెందిన కంటే సాయన్న గ్రాడ్యుయేట్ స్థానానికి ఒక్కొక్క సెట్ నామినేషన్ వేశారు. హైదరాబాద్ కు చెందిన చాలిక చంద్రశేఖర్ గ్రాడ్యుయేట్ స్థానానికి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అదిలాబాద్ కు చెందిన మంచికట్ల ఆశమ్మ ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు.

టీచర్స్ ఎమ్మెల్సీకి ముగ్గురు..

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కూర రఘోతంరెడ్డి, చాలిక చంద్రశేఖర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఒక్కొక్క సెట్టు నామినేషన్, సిలివేరు శ్రీకాంత్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయా అభ్యర్థుల నుంచి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి నామినేషన్లను స్వీకరించారు. పోలీసులు ఈ మేరకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కలెక్టర్ పమేలా సత్పతితో పాటు డిఆర్ఓ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ ఆర్డిఓ కే మహేశ్వర్, తహసిల్దార్లు పాల్గొన్నారు.

More articles

Latest article