23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

సిర్పూర్ భూ కబ్జాల వెనుక ఉన్నది ఎవరు..?

Must read

📰 Generate e-Paper Clip

  • బీఆర్ఎస్ నేతకు రెవెన్యూ, ఇరిగేషన్ అండదండలా..?
  • బీఆర్ఎస్ హయాంలో జరిగిన సర్వేలో తప్పుడు రిపోర్టులు ఇచ్చిందెవరు..?
  • అధికారుల తనిఖీలకు వస్తే కనిపించేది పేదలే కబ్జాదారులవుతారా..?

 

నిజామాబాద్, బతుకమ్మ: పేదలు 100 గజాల సర్కారు స్థలం కబ్జా చేస్తే ఉరుకోదు రెవిన్యూ యంత్రాంగం.. గరీబులు కాలువ గట్టున (బౌండ్రి) లో గుడిసే వేసిన ఉరుకోదు నీటి పారుదల శాఖ… బడుగులు, బలహీన వర్గాలకు, దళితులకు ఇచ్చిన అసైండ్ భూములను కబ్జా చేసినా, అమ్మినా ఉపేక్షించదు అధికార యంత్రాంగం. అటవి ప్రాంతంలో చెట్లను నరికిన, పోడు వ్యవసాయం కోసం చదును చేసినా సహించరు ఫారెస్టు అధికారులు. ఇవన్నీ కేవలం రికార్డులకు పరిమితం. అప్పుడప్పుడు మాత్రమే కొరడా ఝూళిపించడం ఆయా శాఖల పని తీరుగా మారింది. ఒక వ్యక్తి ఒక్కటే గ్రామంలో అధికార బలంతో బరితెగించి కబ్జాలు చేసిన వాటిని తొలగించకుండా రెవిన్యూ, ఆటవీ, నీటి పారుదల శాఖ సహకరించిన ఉదంతం  ‘బతుకమ్మ’ దిన పత్రికలో వచ్చినప్పటికి  అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అత్యధికంగా ప్రభుత్వ భూములు ఉన్నది మోపాల్ మండలంలోనే. మోపాల్ మండలంలో అటవి, అసైన్డ్, రెవిన్యూ(ప్రభుత్వ), నీటి పారుధల శాఖ (గొలుసు కట్టు చెరువులు) భూము లకు కొదువ లేదు. మోపాల్ మండలంలో ప్రధానంగా సిర్పూర్, ముదక్ పల్లి, ధర్మారం లో ఆయా భూములు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వంలో సిర్పూర్  గ్రామ ప్రథమ పౌరుడి పోస్టులో ఉన్న ఆసామి ఏకంగా భూస్వామి అయ్యాడు. ఆనాడు ప్రభుత్వ పెద్ధలు (నియోజకవర్గం) లీడర్ల అండతో రెచ్చిపోయారు. ఏకంగా చెరువులు, కుంటలు, అటవీ, అసైన్డ్ భూములను దేనినీ వదల్లేదు. గుట్టలను చదును చేసి లక్షల రూపాయల మొరాన్ని మింగేశారు. గుట్టలను చదును చేయగా మిగిలిన స్థలంలో వ్యవసాయం చేయడంలో దిట్టగా పేరుగడించారు. కోట్ల రూపాయల మట్టిని మింగడమే కాకుండా కోట్ల విలువైన భూములను చెరబట్టడం గమనార్హం.

మోపాల్ మండలం సిర్పూర్ లోని సర్కార్ సర్వే నంబర్ 602లో 9 ఎకరాల గుట్ట మాయమైంది. గత ప్రభుత్వ హయాంలో నాలుగు ఎకరాల్లో మొరం తరలించేందుకు అనుమతి తీసుకున్న ఘనుడు 9 ఎకరాల్లో తవ్వకాలు చేశాడు. అక్కడ మొరం తవ్వకాలను చేయగా మిగిలిన భూమిలో వ్యవసాయాన్ని చేపట్టాడు. గత 7 సంవత్సరాలుగా అక్కడ వ్యవసాయాన్ని చేస్తూ కబ్జాను కొనసాగిస్తున్నాడు. ఇదే గ్రామంలో నీటి పారుదల శాఖకు చెందిన గొలుసుకట్టు చెరువు అయిన చెంతోడికుంటలో 5 ఎకరాల చెరువు భూమిని చెరబట్టాడు. అదీ చాలదన్నట్లు సిర్పూర్, ముదక్ పల్లి సరిహద్దులోని 602 సర్వే నంబర్ లోనే ఒక స్వామి భూమిని ఆరు సంవత్సరాలుగా చెరబట్టాడు. ఆరు సంవత్సరాలుగా స్థానికంగ ఉన్న పేదలకు గతంలో కేటాయించిన భూముల తాలూకు పత్రాలతో భూమిని కబంధ హస్తాల్లో పెట్టుకున్నాడు. దానితో పాటే పక్కన సర్కారు భూమిలో మొరం తీయగా మిగిలిన భూమిలో ఏకంగా ఫాంహౌజ్ నిర్మించుకుని ఇటీవల అమ్మకానికి పెట్టాడు. అతనికి రెవెన్యూ, ల్యాండ్ సర్వే, అటవి, ఇరిగేషన్ అధికారుల అండదండలతో ఐదేళ్ళుగా కబ్జా సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు.

మోపాల్ మండలం సిర్పూర్ లో జరిగిన భూ కబ్జాలపై గతంలోనూ గ్రామస్తులు ఫిర్యాదులు చేశారు. అయితే అతడికి నీటి పారుదల శాఖ, ల్యాండ్ సర్వే అధికారులు సహకరించడంతో కబ్జా చెరను వీడలేదు. ప్రధానంగా 602 సర్వే నంబర్ లో 9 ఎకరాల భూమిని కబ్జా చేయగా అక్కడ గతంలో పేదలకు ఇచ్చిన పట్టాలతో వారే కబ్జాలో ఉన్నట్లు రికార్డులు చేయడం విశేషం. ఇదే ప్రయోగాన్ని 602లోనే స్వామికి చెందిన భూమిలో ప్రయోగించారు. అదీచాలదన్నట్లు చింతోడికుంట చెరువు కబ్జాపై స్థానిక మత్స్యకారులు నీటి పారుదల శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఆ భూముల కబ్జాను విడిపించలేదు.

More articles

Latest article