నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వారం రోజులు గడువకముందే చోరీలకు తెగబడ్డారు. 6వ టౌన్ పరిధిలోని ధర్మపురి హిల్స్ , రంజానిబాబా దర్గా ప్రాంతంలోని షేక్ వసీం అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బంధువుల ఇంట జరిగే పెండ్లీ కోసం ఇంటికి తాళం వేసి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. వసీం ఇంట్లో రూ.3 లక్షల వరకు నగదు, ఇతర సామాగ్రిని చోరీకి పాల్పడ్డారు. అదే ప్రాంతంలోని హమాల్ కాలనీలో షేక్ సల్మాన్ ఇంట్లో చోరీకి యత్నించారు. అహ్లే అజిజ్ ఈద్గా ప్రాంతంలోని సల్మాన్ ఇంట్లో రాత్రి దొంగతనానికి యత్నించారు. సల్మాన్ ఆదివారం కుటుంబ సమేతంగా విందు కోసం ఇంటికి తాళం వేసి వెళ్లగా గమనించిన దొంగలు చోరీకి యత్నించారు. దొంగలు ఎలాంటి సొత్తును చోరీ చేయలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఆధారంగా చోరీ జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు, ఆనవాళ్ళను సేకరించారు.
1845
